బంద్‌పై ప్రతిష్టంభన! | Telangana Govt hold talks with private college owners until midnight | Sakshi
Sakshi News home page

బంద్‌పై ప్రతిష్టంభన!

Sep 15 2025 2:08 AM | Updated on Sep 15 2025 2:09 AM

Telangana Govt hold talks with private college owners until midnight

ఆదివారం రాత్రి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చల్లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్‌ రామకృష్ణారావు

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో అర్ధరాత్రి వరకు ప్రభుత్వం చర్చలు

ఫీజు బకాయిలు చెల్లించకపోతే సోమవారం నుంచి కాలేజీలు బంద్‌ చేస్తామన్న యాజమాన్యాలు 

బకాయిలు ఏకకాలంలో చెల్లించలేమని, విడతల వారీగా చెల్లిస్తామన్న ప్రభుత్వం 

సమ్మె విరమించమని కోరాం.. వారు సానుకూలంగా స్పందించారన్న భట్టి 

చర్చలు ఫలవంతం కాలేదన్న యాజమాన్యాలు 

ఆందోళన బాటలో ప్రైవేట్‌ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలు 

నేడు మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రైవేటు విద్యాసంస్థలన్నింటినీ మూకుమ్మడిగా మూసివేయాలని నిర్ణయించుకొని యాజమాన్యాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు చర్చలకు ఉపక్రమించింది. 

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ప్రజా భవన్‌లో సమావేశమయ్యారు. ఇరుపక్షాల మధ్య నాలుగు గంటలపాటు జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదని తెలిసింది. 

ప్రభుత్వం నుంచి ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రాకపోవడంతో కళాశాలలు నడపటం కష్టంగా మారిందని, జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని యాజమాన్యాలు చెప్పాయి. తమకు రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని కోరాయి. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంలో స్పష్టమైన హామీ రాలేదని యాజమాన్యాలు చెప్పాయి. 

రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఫీజు బకాయిలు ఏకకాలంలో చెల్లింపు సాధ్యం కాదని, విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. కళాశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. విద్యాసంస్థల డిమాండ్లను ఇప్పటికిప్పుడు నెరవేర్చడం సాధ్యం కాదని, కళాశాలలు మూసివేయడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పింది. 

ఫీజుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా రాకపోవడంతో కళాశాలల మూసివేత నిర్ణయంపై వెనక్కు తగ్గే విషయంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి స్పష్టత ఇవ్వలేకపోయినట్టు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇరుపక్షాల మధ్య మళ్లీ చర్చలు జరగనున్నాయి. 

సమస్యలను అర్థం చేసుకున్నాం 
మంత్రి శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రైవేట్‌ కళాశాలల యజమాన్యాలు ఆదివారం అయినప్పటికీ అందరం కలిసి సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించాం. చర్చలు సానుకూలంగా సాగాయి. 

కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు సమ్మెను విరమించమని కళాశాలల యజమానులను కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. 
–సమావేశం అనంతరం భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం  

ఉదయం ఏం జరిగిందంటే.. 
అంతకుముందు ఉదయం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సమావేశమై కార్యాచణపై చర్చించాయి. సోమవారం నుంచి బంద్‌కు పాటించాలని నిర్ణయించాయి. ఫీజులు చెల్లించే వరకూ ఎట్టి పరిస్థితుల్లో కాలేజీలు తెరవొద్దని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఫతి) ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం ఏడాది నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాయి. 

గత ఏడాది పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి కూడా. దీంతో ప్రభుత్వం స్పందించి వారితో చర్చలు జరిపింది. దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో అప్పుడు ఆందోళన నిర్ణయాన్ని యాజమాన్యాలు విరమించుకున్నాయి. తాజాగా శుక్రవారం యాజమాన్య ప్రతినిధులు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డిని కలిసి నోటీసు ఇచ్చారు. 

సెప్టెంబర్‌ 30లోపు బకాయిలను విడుదల చేయకపోతే, ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం సర్కారు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో విద్యాసంస్థలను మూకుమ్మడిగా మూసివేయాలని నిర్ణయించారు. బంద్‌ జరిగితే రాష్ట్రంలోని 1,500 పైచిలుకు ప్రైవేట్‌ ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్‌ కాలేజీలకు తాళాలు పడనున్నాయి. దాదాపు 10 లక్షల విద్యార్థులకు బోధన దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.  

ఓపిక నశించిందన్న ప్రతినిధులు 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లిస్తుందని ప్రభుత్వంపై ఇన్నాళ్లు విశ్వాసం పెట్టుకున్నామని ‘ఫతి’ ప్రతినిధులు ఉదయం మీడియాకు చెప్పారు. ఇక ఓపిక నశించిందని, అందుకే ఆందోళన బాట పట్టామని తెలిపారు. టోకెన్లు జారీ చేసినప్పటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. దీంతో అన్ని కాలేజీల యాజమాన్యాలు ఉమ్మడి పోరుబాటకు సిద్ధమై ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. 

రూ.లక్ష కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా ట్రస్ట్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రైవేటు యాజామాన్యాలు సర్కారుకు ప్రతిపాదించాయి. ఈ లక్ష కోట్లలో సర్కారు వాటా పరిమితమేనని, సీఎస్సార్, కార్పస్‌ ఫండ్‌ వంటి ఇతర మార్గాల ద్వారానే ఈ నిధులను సేకరించవచ్చని సూచించాయి. లక్ష కోట్ల డిపాజిట్లపై వచ్చే ఏడు శాతం వడ్డీ (సుమారు రూ.3వేలకోట్లు)తో ఫీజు రీయింబర్స్‌ చేయొచ్చని ప్రతిపాతిదించాయి. దీనిని కూడా సర్కారు పట్టించుకోలేదు. 

ఈ నేపథ్యంలో అన్ని రకాల వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలు గురువారం రాత్రి సమావేశమయ్యాయి. సెపె్టంబర్‌ 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్‌ పాటించాలని నిర్ణయించాయి. ‘ఫతి’ బాటలోనే తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీడీపీఎంఏ) కూడా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. తాము ఈ నెల 16 నుంచి కాలేజీలను మూసివేస్తామని అసోసియేషన్‌ చెప్పింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement