సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు సఫలమయ్యాయి. ప్రైవేటు యాజమాన్యాల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. దశలవారీగా బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ స్పందనకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు.. బంద్‌ను విరమించుకున్నాయి.
ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క-కోమటిరెడ్డి-ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల చర్చలు విజయవంతంగా ముగిశాయి. నిరసన కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHI) అధికారికంగా ప్రకటించింది. ‘‘కళాశాల యాజమాన్యాలు బకాయిలకు సంబంధించి 1,500 కోట్లు అడిగారు. ఇప్పటికే 600 కోట్లు విడుదల చేశాం. మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తాం, మరో 300 కోట్లు కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలకు కమిటీ ఏర్పాటు చేస్తాం. యాజమాన్యాలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తాం.’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
ఐఏఎస్ అధికారిణి దేవసేన, సీఎంవో, డిప్యూటీ సీఎం కార్యాలయాలపై వ్యాఖ్యలు చేయలేదని పాతి సంఘం స్పష్టం చేసింది. తమ మాటలను మీడియా వక్రీకరించిందని పాతి అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వక్రీకరణలపై ఖండన ప్రకటనను ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపామని పాతి సంఘం వివరణ ఇచ్చింది. సమ్మె కారణంగా పరీక్షలు ఆగినందుకు చింతిస్తున్నాం. త్వరగా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతాం. చర్చలు విజయవంతం కావడంతో రేపటి లెక్చరర్ల ప్రదర్శన రద్దు చేశాం’’ అని పాతి జనరల్ సెక్రటరీ రవికుమార్ వెల్లడించారు.


