
అమరావతిలో కట్టబెట్టేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాజధానిలో భూములు కేటాయించినందుకు ఒకపక్క కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎకరానికి రూ.నాలుగైదు కోట్ల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు అదే చోట ప్రైవేట్ సంస్థలకు వందల ఎకరాలను భారీ తగ్గింపు ధరలకు కట్టబెడుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థల పట్ల ఒకలా.. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించే పైవేట్ సంస్థల పట్ల మరోలా వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజ«దాని రైతుల నుంచి తీసుకున్న భూములను గతంలో ఇచ్చిన ప్రైవేట్ సంస్థలకే మళ్లీ మళ్లీ పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేట్ విద్యాసంస్థలు ఎస్‌ఆర్‌ఎం, విట్ అమరావతిలో ఎకరం రూ.2 కోట్లు చొప్పున ఒక్కో సంస్థకు వంద ఎకరాలు చొప్పున కేటాయించేందుకు తాజాగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. కాగా ఈ రెండు ప్రైవేట్ యూనివర్సిటీలకు గతంలోనే టీడీపీ హయాంలో ఎకరం రూ.50 లక్షలు చొప్పున ఒక్కో విద్యాసంస్థకు అమరావతిలో ఏకంగా 200 ఎకరాలు కేటాయించడం గమనార్హం.
తాజాగా కేటాయిస్తున్నవి దీనికి అదనం. సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్దసారథి మీడియాకు వెల్లడించారు. నాలా చట్టం 2006 వల్ల సాగు భూములు వ్యవసాయేతర అవసరాల మార్పిడికి అనుమతి పొందే ప్రక్రియ సంక్లిష్టతతో ఉన్నందున ఈ చట్టం రద్దు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు ఆర్డినెన్స్ జారీకి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
నాలా చట్టం రద్దు నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్–అర్బన్ డెవల‹³మెంట్ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం 1920, ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీలు చట్టం 1965లకు సవరణల ప్రతిపాదనను ఆమోదించినట్లు చెప్పారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు ఇవీ..
» గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2,954 చదరపు గజాల మునిసిపల్ భూమి గతంలో 33 సంవత్సరాలు లీజుకు కేటాయించగా ఇప్పుడు ఎకరం రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్లపాటు లీజు పెంచుతూ ఆమోదం.
» హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపులో మరిన్ని రాయితీలు కల్పించేందుకు పర్యాటక విధానంలో మార్పులకు ఆమోదం.
» చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పీపీపీ విధానంలో అభివృద్ధి. భూసేకరణ, ఇతర అవసరాలకు హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు ఆమోదం.
» ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ – వ్యర్థ పదార్థాల పునరి్వనియోగ విధానం 2025–30కు ఆమోదం.
» ఐఎంఎఫ్‌ఎల్, బీర్, వైన్, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ నిర్ణయించిన ధరలకు ఆమోదం. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ధరల నిర్ణయం.
» అధికార భాషా కమిషన్ పేరు ‘‘మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్’’గా మార్పు
» అమరావతి క్యాపిటల్ సిటీలో క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కింద ల్యాండ్ పూలింగ్ జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఈపీసీ కింద టెండర్లకు అనుమతి. మౌలిక సదుపాయాల కోసం రూ.904.00 కోట్లకు పరిపాలనా ఆమోదం.
» గ్రామ, వార్డు సచివాలయాల్లో వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుంచి ‘విద్య’ తొలగించి వార్డు సంక్షేమ, అభివృద్ధి సెక్రటరీకి అప్పగించేందుకు ఆమోదం. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 పోస్టులు సృష్టించడంతో పాటు మొత్తం 2,778 పోస్టులు డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్‌లో భర్తీకి ఆమోదం.
» మాన్యువల్ స్కావెంజర్స్ నియామకంపై నిషేధం. ఆ వృత్తిలో ఉన్నవారికి పునరావాస చర్యలకు ఆమోదం. ఏపీ యాచక చట్టంలో వికలాంగులు, కుష్టు వ్యాధి బాధితుల పట్ల వివక్షపూరిత పదాలను తొలిగించే ముసాయిదా బిల్లుకు ఆమోదం.
» పుష్కర ఎత్తిపోతల పథకంలో ప్రెజర్ మెయిన్ పైపు మార్చేందుకు రూ.51.67 కోట్లకు పరిపాలన అనుమతి.
» ఏఎస్‌ఆర్ జిల్లా చింతూరులో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 100 పడకల ఏరియా ఆస్పత్రిగా మార్చేందుకు ఆమోదం.
» అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్– ఐ సర్వీసెస్) ఉద్యోగం ఇచ్చేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
» పల్నాడు జిల్లా గుండ్లపాడులో హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చేలా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
» వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం వడ్డిరాల, దొడియం గ్రామాల్లో 1,200.05 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా అదానీ సోలార్ ఎనర్జీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం.
» ఆంధ్రప్రదేశ్ సముద్ర విధానం 2024–29 సవరణకు ఆమోదం.
» నారావారిపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 50 పడకల సీహెచ్‌సీగా అప్‌గ్రెడేషన్.
» చిత్తూరు జిల్లా కుప్పం మండలం బైరుగానిపల్లెలో కేంద్రీయ విద్యాలయ పాఠశాల ఏర్పాటుకు వీలుగా 7.74 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా అప్పగించేందుకు ఆమోదం.
» గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర నిధులతో ‘సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి’ ఏర్పాటుకు 12.96 ఎకరాల ప్రభుత్వ భూమి ఆయుష్ శాఖకు అప్పగించేందుకు ఆమోదం.
» అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయ భవనంలో నిర్మాణ పనుల నిర్వహణకు రూ.160 కోట్లకు పరిపాలనా అనుమతి.
» 62 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యూటీ ఇస్తూ గతంలో జారీ చేసిన జీవోకు ఆమోదం.