4,129 దరఖాస్తులు! | Sakshi
Sakshi News home page

4,129 దరఖాస్తులు!

Published Fri, Mar 31 2017 8:02 PM

4,129 దరఖాస్తులు!

► మద్యం దుకాణాల లైసెన్సుల కోసం బారులుతీరిన దరఖాస్తుదారులు
► ఒక్క దరఖాస్తు కూడా రాని దుకాణాలు 9
► నేడు బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో లాటరీ
► వివరాలు వెల్లడించిన డిప్యూటీ కమిషనర్‌ జోసెఫ్‌


ఒంగోలు క్రైం: మద్యం షాపులకు గురువారం చివరిరోజుతో కలుపుకొని మొత్తం 4,129 దరఖాస్తులు వచ్చాయి. వివరాలను ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ గోళ్ల జోసెఫ్‌ వెల్లడించారు. ఒంగోలు, మార్కాపురం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో మొత్తం 331 మద్యం షాపులకుగాను 322 దరఖాస్తులు వచ్చాయి. ఒంగోలు ఈఎస్‌ పరిధిలో 1,674 ధరఖాస్తులు రాగా, మార్కాపురం ఈఎస్‌ పరిధిలో 2,455 వచ్చాయి. జిల్లా మొత్తం మీద 9 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఒంగోలు ఈఎస్‌ పరిధిలో మొత్తం 154 మద్యం షాపులకు రావాల్సి ఉండగా ఏడు షాపులకు ఒకటి కూడా రాలేదు. ఒంగోలు నగరంలో 5, చీరాల పట్టణంలో రెండు షాపులున్నాయి. అదేవిదంగా మార్కాపురం ఈఎస్‌ పరిధిలో మొత్తం 177 మద్యం షాపులకుగాను రెండు షాపులకు రాలేదు. కందుకూరు పట్టణంలో ఒకటి, సింగరాయకొండలో మరొక షాపు ఉన్నాయి.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఔత్సాహికులు రాత్రి పొద్దుపోయేవరకు స్థానిక ప్రకాశం భవన్‌లోని ఒంగోలు ఈఎస్‌ కార్యాలయంలో వాటి కాపీలను సమర్పిస్తున్నారు. అందుకు గాను చలానా ఫీజు, రిజిస్ట్రేషన్‌ ఫీజులను ఇస్తున్నారు. కలెక్టర్‌ సుజాతశర్మ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ సమీపంలోని బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి లాటరీ ద్వారా షాపులకు లైసెన్స్‌లు కేటాయిస్తారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానున్నందున కొత్తగా మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి.

Advertisement
Advertisement