లెక్క తప్పింది.. కిక్కు తగ్గింది!
గతంతో పోలిస్తే గ్రేటర్ జిల్లాల్లో తగ్గిన 10,673 దరఖాస్తులు
టెండర్లు తగ్గినా.. ఫీజు పెంపుతో పెరిగిన ఆదాయం
27న మద్యం షాపులకు కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా
సాక్షి, రంగారెడ్డి: ఆబ్కారీ శాఖ అంచనా తప్పింది. ఇబ్బడిముబ్బడిగా వచ్చే దరఖాస్తులతో దండిగా రాబడి ఉంటుందని భావించిన ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆదాయంలో తేడా రాకున్నా.. దరఖాస్తుల నమోదులో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. గతంతో పోలిస్తే ఏకంగా పదివేల దరఖాస్తులు తక్కువ రావడంతో అధికారులను నివ్వెరపోయేలా చేసింది.
అయితే, దరఖాస్తు ధర రూ.3 లక్షలు నిర్దేశించడంతో ఇది ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. కానీ ఇందుకు భిన్నంగా 10,673 దరఖాస్తులు తక్కువ వచ్చాయి. కాగా, దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో ఆదాయం కొంత పెరిగినట్లు కన్పించినా.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ కిక్కు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం సహా దేశీయంగా రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలు దెబ్బతినడం, అప్పటి వరకు ఆయా రంగాలపై ఆధారపడిన వాళ్లు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడడం, ఇదే సమయంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, ఎన్నికల్లో ఖర్చుల కోసం అభ్యర్థులు తమ వద్ద ఉన్న కొద్ది మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసి పెట్టుకోవడంతో ఔత్సాహిక వ్యాపారులకు మార్కెట్లో అప్పు దొరకని పరిస్థితి.
అంతేకాదు షాపుల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఎక్సైజ్ అధికారులకు ప్రతి నెలా గుడ్‌విల్ పేరుతో అదనపు చెల్లింపులు సైతం దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి మరో కారణం. ప్రభుత్వం దరఖాస్తు ఫీజును పెంచడంతో మెజార్టీ వ్యాపారులు వైన్స్ టెండర్లను భారంగా భావించారు. అప్పటి వరకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసినవారు.. ప్రస్తుతం ఒకటి రెండు షాపులకే పరిమితమయ్యారు. ఫలితంగా ప్రభుత్వం మద్యం షాపుల టెండర్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2023–25లో గ్రేటర్ జిల్లాల్లోని ఏడు డివిజన్ల పరిధిలో మొత్తం 45,631 దరఖాస్తులు రాగా, రూ.906.62 కోట్ల ఆదాయం సమకూరింది. 2025–27 ఆర్థిక సంవత్సరంలో 639 మద్యం షాపులకు నిర్వహించిన టెండర్లలో 34,958 దరఖాస్తులే వచ్చాయి. ఫీజు పెంపు కారణంగా రూ.1,048.74 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉంటే ఆయా మద్యం దుకాణాలకు ఈ నెల 27న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించనున్నారు.


