లిక్కర్ దుకాణాల దరఖాస్తుల గడువు పెంపుపై హైకోర్టు ప్రశ్న
ఏ నిబంధన మేరకు గడువు పొడిగించారో సర్కార్ చెప్పాలి
దరఖాస్తుల గడువు పెంచితే వచ్చే నష్టమేంటి?
స్వీకరించవద్దని ఎలా చెబుతారని పిటిషనర్లకు ప్రశ్న.. ఇరుపక్షాల నుంచి పూర్తిస్థాయి వాదనలు వినాలి
కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యలు.. తదుపరి విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఎలా మార్పు చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. సొంత నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఎలా? అని అడిగింది. ఏ నిబంధన మేరకు గడువు పొడిగించారో చెప్పాలని, లేనిపక్షంలో లిక్కర్ షాపుల ఎంపిక ప్రక్రియను నిలిపివేయాల్సి వస్తుందని చెప్పింది. మరోవైపు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచితే వచ్చే నష్టమేంటని పిటిషనర్లను ప్రశ్నించింది. దరఖాస్తులను స్వీకరించవద్దని ఎలా చెబుతారని నిలదీసింది. కాగా, ప్రాథమిక ఆధారాలున్నందున ఇరుపక్షాల పూర్తి స్థాయి వాదనలు వినాలని అభిప్రాయపడింది. వాదనలు ముగిసే వరకు ప్రక్రియను నిలిపివేయడమో లేదా ఈ నెల 18వ తేదీని కటాఫ్‌గా తీసుకోవడమో చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
ఏదేమైనా శనివారం మరోసారి వాదనలు వింటామని చెబుతూ, విచారణను వాయిదా వేసింది. మద్యం దుకాణాల దరఖాస్తుల గడువును పొడిగించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన డి.వెంకటేశ్వరరావుతో పాటు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో 2025–27కు సంబంధించి 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు కోరుతూ ఆగస్టు 20న నోటిఫికేషన్ విడుదలైంది. తొలుత దరఖాస్తుల గడువును ఈ నెల 18వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఈ నెల 23 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
23న జరగాల్సిన డ్రాను 27కు వాయిదా వేసింది. దరఖాస్తుల గడువు పెంపు నిర్ణయం తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టంలోని నిబంధన 12(5)లకు విరుద్ధం. 18వ తేదీ తర్వాత పోటీ పెరిగింది. దీంతో పిటిషనర్లకు మద్యం దుకాణాలు పొందే అవకాశాలు తగ్గిపోయాయి. కారణాలు ఏవైనా గడువు పెంపు చట్టవిరుద్ధం. దుకాణాల కోసం గడువు పొడిగిస్తూ 18న తెలంగాణ ప్రభుత్వ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జారీ చేసిన మెమోను కొట్టివేయాలి. విచారణ పూర్తయ్యే వరకు ప్రక్రియపై స్టే విధించాలి’అని కోరారు.
ప్రక్రియను నిలిపివేయవద్దు..
ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్లు కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ మెమోను సవాల్ చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లాల్లో ప్రచురించిన గెజిట్‌ను వారు సవాల్ చేయలేదు. ఈ నెల 18 వరకు మద్యం దుకాణాల కోసం మొత్తం 89,343 దరఖాస్తులొచ్చాయి. ఆ తర్వాత వచి్చన వాటి సంఖ్య 5,793 మాత్రమే. ఇది చాలా తక్కువ. మొత్తం దరఖాస్తుల సంఖ్యలో దాదాపు 5 శాతమే. గడువు పెంపు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. పరిస్థితుల మేరకు గడువు పెంచే అధికారం సర్కార్‌కు ఉంటుంది. దుకాణాల కేటాయింపు ప్రక్రియపై ఎలాంటి స్టే ఇవ్వవద్దు. మొత్తం ప్రక్రియపై స్టే ఇస్తే అది సర్కార్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. శనివారం వాదనలు విని నిర్ణయం తీసుకుంటామంటూ విచారణను వాయిదా వేశారు.


