లోకాయుక్త ఆదేశాలపై హైకోర్టు స్టే
ప్రతివాదులకు నోటీసులు జారీ
‘శంకర్‌నాయక్’ భూ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్‌లోని అనంతారం గ్రామం సర్వే నంబర్ 137/27లోని 1.07 ఎకరాలను సేవాలాల్ మందిరానికి దీర్ఘకాలిక లీజుకు, వాస్తవ ధరకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలన్న లోకాయుక్త ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. లోకాయుక్త రిజిస్ట్రార్‌తోపాటు శంకర్‌నాయక్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది.
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మరో నలుగురితో కలిసి సేవాలాల్ ఆలయాన్ని నిర్మించడానికి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి 10 నుంచి 15 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ లోకాయుక్తకు ఓ ఫిర్యాదు అందింది. ఈ ట్రస్టు అక్కడ నిర్మించే అతిథి గృహానికి రోడ్డు కోసం ఒక రైతు భూమిలోని మిర్చి పంటను తొలగించిందని, దీంతో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడని అందులో పేర్కొన్నారు.
ఈ ఘటన ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైందన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఆక్రమణపై దర్యాప్తు జరిపి, ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన లోకాయుక్త జిల్లా కలెక్టర్‌ను నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
2017, 2021లో కలెక్టర్ నివేదికలు సమర్పించారు. ట్రస్ట్ ఆక్రమించిన 1.07 ఎకరాల్లో లింటెల్ లెవల్ వరకు నిర్మాణం, అప్రోచ్ రోడ్డు, బోర్‌వెల్ కనిపించాయన్నారు. సదరు భూమిని లీజు లేదా ధరకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్‌ను లోకాయుక్త ఆదేశించింది.
ఆక్రమించినట్లు శంకర్ ఒప్పుకున్నారు..
లోకాయుక్త గతేడాది జనవరిలో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కలెక్టర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కలెక్టర్ తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ తేరా రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘లోకాయుక్త తన అధికార పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టం–1977, తెలంగాణ లోకాయుక్త చట్టం–1983 నిబంధనలకు విరుద్ధం. సేవాలాల్ మందిర నిర్మాణం కోసం భూమిని ఆక్రమించినట్లు శంకర్‌నాయక్ లోకాయుక్త విచారణలో ఒప్పుకున్నారు. నిబంధనలకు మేరకు ఏదైనా కంపెనీ, ప్రైవేట్ సంస్థ, సంఘాలకు భూమి కేటాయించాలంటే కేబినెట్ ఆమోదం తప్పనిసరి.
చట్టవిరుద్ధంగా దాఖలు చేసిన వినతిపత్రం ఆధారంగా ఆ భూమిని శంకర్‌నాయక్‌కు అప్పగించలేమని సీసీఎల్‌ఏ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘిస్తూ ఇచ్చిన ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.


