నంబర్ వన్ మోసంగా బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్
ఈ ఏడాది 11,657 కేసులలో రూ.255.45 కోట్లు మాయం
ఐడెంటిటీ థెఫ్ట్, లోన్ ఫ్రాడ్, అడ్వర్టైజ్‌మెంట్, ఆన్‌లైన్ బిజినెస్ మోసాలు అధికం
గతేడాదితో పోలిస్తే తగ్గిన సైబర్ నేరాల నమోదు సంఖ్య
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా మన కష్టార్జితాన్ని కాజేసే సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త రకం మోసాలకు తెరతీస్తూనే ఉన్నారు. లాటరీ వచ్చిందని, ఆఫర్లు ఉన్నాయని, ఆన్‌లైన్ జాబ్‌లు ఇస్తామని, పెట్టిన పెట్టుబడి రోజులు, నెలల వ్యవధిలోనే ఎన్నో రెట్లు పెరుగుతుందని.. ఇలా నిత్యం ఏదో ఒక రకమైన మోసపూరిత వల విసురుతూనే ఉన్నారు. అయితే, గతేడాదితో పోలిస్తే 2025లో సెప్టెంబర్ వరకు సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిచ్చే అంశం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందుతున్న ఫిర్యాదులలో ఎక్కువగా ఐదు రకాల మోసాలకు సంబంధించినవే ఉన్నట్టు సమాచారం. ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు ఇందులో మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో ఐడెంటిటీ థెఫ్ట్ (వ్యక్తిగత సమాచారం సేకరించి మోసాలు) మోసాలు, అడ్వరై్టజ్‌మెంట్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, బిజెనెస్–పార్ట్‌టైం జాబ్ మోసాలు ఉన్నాయి.
అత్యాశే అనర్థాలకు మూలం..
పెట్టిన పెట్టుబడి రోజులు, నెలల్లోనే రెట్టింపు అవుతుందన్న ప్రకటనలు నమ్మి మోసపోతున్నవారే అధికంగా ఉంటున్నారు. ప్రజల అత్యాశనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధిక రాబడి వాగ్దానాలను నమ్మవద్దు. నెలకు 10 నుంచి 20 శాతం రిటర్న్‌ల వంటి వాగ్దానాలు ఇస్తున్నారంటే అది మోసమని గ్రహించాలి. ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలి. సెబీ (సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమోదం లేని యాప్‌లు వాడవద్దు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు సూచించిన యాప్‌లలో లాభాలు చూపి, రియల్ అకౌంట్‌లో నష్టం కలిగిస్తారని మరవొద్దు అని నిపుణులు సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
తెలంగాణలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ 18 నుంచి 20 శాతం వరకు ఉంటున్నాయి. ఈ తరహా మోసాలకు ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు బలవుతున్నారు. ఆ తర్వాత 30 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, ఇతర విద్యాధికులు ఉంటున్నారు. అయితే, స్టాక్స్ ఇతర షేర్లలో పెట్టుబడులకు సంబంధించి వెరిఫైడ్ ఏజెన్సీల నుంచి మాత్రమే సూచనలు తీసుకోవాలి. అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్ ద్వారానే చెల్లింపులు చేయాలి. వాట్సాప్ లింక్‌లలో వచ్చే సందేశాలు నమ్మి మోసపోవద్దు. మీరు పెట్టుబడి పెట్టే స్టాక్స్ వివరాలు ముందుగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టాలి.
– శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సీఎస్‌బీ (ఫొటో కామన్‌లో శిఖాగోయల్ పేరిట ఉంటుంది)


