దేశంలో మితిమీరిన వేగంతోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు
2022, 2023లలో సుమారు 70% యాక్సిడెంట్లు అతివేగంతోనే..
ఆ తర్వాతి కారణాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్‌రూట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్
సాక్షి, హైదరాబాద్: ‘వేగంకన్నా ప్రాణం మిన్న’అంటూ రోడ్డు రవాణా శాఖ చేసే సూచనను ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడిపే డ్రైవర్లు గాలికొదిలేస్తున్నారు. ఇతర ట్రావెల్స్ బస్సులకన్నా ముందుగా గమ్యం చేరాలన్న ఆలోచనతో అతివేగంగా బస్సులను నడుపుతూ వాటిని మృత్యుశకటాలుగా మారుస్తున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర దుర్ఘటనే ఇందుకు తాజా నిదర్శనం. ముందు వెళ్తున్న బైక్‌ను బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తు వెల్లడిస్తోంది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మితిమీరిన వేగం కారణంగానే జరుగుతున్నట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022లో అతివేగం కారణంగా 72.26 శాతం (3,33,323) రోడ్డు ప్రమాదాలు జరగ్గా 2023లో 68.4 శాతం (3,22,795) ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాలకు అతివేగం తర్వాత డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్, రెడ్‌లైట్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఉన్నట్లు తేలింది. 2023లో నమోదైన గణాంకాల ప్రకారం బస్సులు ఢీకొనడం వల్ల దేశవ్యాప్తంగా 4,327 మంది మృత్యువాతపడ్డారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలో 2023లో మొత్తం 16,916 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 2024లో 18,991 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.

రాత్రి వేళల్లో ప్రమాదాల తీవ్రత ఎక్కువ..
జాతీయ రహదారులపై దూర ప్రయాణాలు చేసే వాహనాలకు రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను అనుకోని పరిస్థితుల్లో అకస్మాత్తుగా అదుపులోకి తెచ్చే క్రమంలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోందని వారు చెబుతున్నారు. హెచ్చరిక బోర్డుల ప్రకారం ఆ రోడ్డులో ఎంత వేగంగా వెళ్లాలి.. ఏ మలుపు వద్ద ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందన్నది స్పష్టంగా ఉంటున్నా కొందరు వాహనదారులు పట్టించుకోవడం లేదు.
అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల్లో ఇద్దరు చొప్పున డ్రైవర్లు ఉంటున్నా కొన్నిసార్లు తెల్లవారుజామున నిద్రమత్తులోకి వెళ్లడం వల్ల రెప్పపాటులో భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు సైతం ఆదమరిచి నిద్రపోయే సమయం కావడంతో ఏదైనా ప్రమాదం జరిగి మంటలు అంటుకొనే పరిస్థితి తలెత్తితే తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో గందరగోళం నెలకొని ప్రాణనష్టం పెరుగుతోందని నిపుణులు పేర్కొన్నారు.


