బంజారాహిల్స్: అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు గాను బీఆర్‌ఎస్ నేత సల్మాన్‌ఖాన్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బోరబండకు చెందిన సల్మాన్‌ఖాన్ హెచ్‌వైసీ పార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. బుధవారం స్క్రూట్నీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాం తన నామినేషన్‌ను తిరస్కరించడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమేగాక విధులకు ఆటంకం కలిగించారు. అసభ్య పదజాలంతో దూషించారు. తన నామినేషన్‌ను కావాలనే తిరస్కరించారని, దీనిపై కాంగ్రెస్ ఒత్తిడి ఉందంటూ ఆరోపించారు. అతడి వైఖరి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమైనందున అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇదిలా ఉండగా సల్మాన్‌ఖాన్ గురువారం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం విదితమే. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


