మూగ వేదన | Summer warming is not able to increase | Sakshi
Sakshi News home page

మూగ వేదన

Mar 21 2017 1:58 AM | Updated on Oct 3 2018 5:26 PM

మూగ వేదన - Sakshi

మూగ వేదన

శేషాచలం తూర్పు కనుమల్లో భాగం. చిత్తూరు, వైఎస్సార్‌ కడప జల్లాల్లో వ్యాపించి ఉన్నాయి.

వేసవి తాపం పెరిగి పోతోంది. శేషాచలంలోని జలపాతాలు, నీటి గుంటలు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. వీటిపై ఆధారపడ్డ మూగజీవులు గుక్కెడు నీటికోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. రెండు ఘాట్‌రోడ్లలో టీటీడీ ఏర్పాటు చేసిన నీటి తొట్టెలే శరణ్యంగా
మారాయి.

 
తిరుమల: శేషాచలం తూర్పు కనుమల్లో భాగం. చిత్తూరు, వైఎస్సార్‌ కడప జల్లాల్లో వ్యా పించి ఉన్నాయి. ఇవి సుమారు ఐదున్నర లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించాయి. తిరుమల కొండల్లో మొదలై కర్నూలు జిల్లాలోని కుందేరు నది వరకు వ్యాపించి ఉన్నాయి. భారత పర్యావరణ, అటవీశాఖ 2010 సెప్టెంబర్‌ 20న శేషాచల బయోస్పియర్‌ రిజర్వుగా ప్రకటించాయి. ఈ బయోస్పియర్‌ మొత్తం విస్తీర్ణం 4,756 చ.కి.మీ. జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. అందుకే ‘శేషాచల బయోస్పియర్‌ రిజర్వు’గా ప్రకటించారు.

అరుదైన వన్యప్రాణుల ఆవాసం
అరుదైన జంతు, జీవజాతులకు ఆవాసం శేషాచలం. అనేక రకాల క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరజీవులు, కీటకాలు, సూక్ష్మ జీవులు, శిలీంధ్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన 38 రకాల క్షీరదాల్లో .. ఏనుగులు, చిరుత, రేసు కుక్కలు, ఎలుగు బంటి, పునుగుపిల్లి, గుంటనక్కలు, అడవిపిల్లి, ముంగిస, కణుతులు, దుప్పులు, చుక్కల జింక, కొండ గొర్రె, బెట్లు ఉడత, దేవాంగ పిల్లి ఉన్నాయి. 178 రకాల పక్షిజాతుల్లో ప్రధానంగా ఎల్లో (తోటెడ్‌ బుల్‌బుల్‌ )పక్షి, గ్రీన్‌ పీజియన్, లార్జ్‌హక్‌– కుకు పక్షి జాతులు అరుదైనవి. 63 రకాల సీతాకోక చిలుకలు, 27 రకాల సరీçసృపాల జాతుల్లో అతిముఖ్యమైన స్లెండర్‌ కోరల్, బ్రై న్‌వైన్, ఏలియట్‌ సీల్డ్‌టైర్‌ సర్పం ఉన్నాయి. వీటితోపాటు 12 రకాల ఉభయచర జీవులు కూడా ఉన్నాయి.

దాహం..దాహం
పచ్చని ప్రకృతికి శేషాచలం పెట్టింది పేరు. వరుణుడు ముఖం చాటేయడంతో శేషాచలంలో నీటి జాడలేకుండాపోతోంది. శేషాచలంలో ప్రధానంగా గుర్తించిన 365 జలపాతాల్లో చేతివేళ్ల మీద లెక్కపెట్టే తలకొన, గుండ్లకోన, గుంజన వంటి వాటిల్లో మినహా మిగిలినచోట్ల నీటి జాడలేదు. అడవిలో ఉండే నీటి గుంటలు కూడా ఎండిపోయాయి. తాపం తీర్చుకునేందుకు జంతువులు, ఇతర వన్యప్రాణి జాతులు  అలమటించాల్సి వస్తోంది. నీటికోసం మైళ్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే .. మున్ముందు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దాహం తీరుస్తున్న టీటీడీ నీటి తొట్టెలు
తిరుమల రెండు ఘాట్‌ రోడ్లలో వాహనాల రేడియేటర్లకు నీళ్లు పోసుకునేందుకు టీటీడీ ప్రత్యేకంగా సిమెంట్‌ తొట్టెలు ఏర్పాటు చేసింది. ఇవి జంతువుల దాహం తీర్చేం దుకు ఉపయోగపడేవి. ఈ తొట్టెల్లో నీటి శాతం తగ్గిపోవడంతో జంతువులు, పిట్టలు అష్టకష్టాలు పడేవి. దాహం తీర్చుకునే క్రమంలో అనేక పక్షులు మృత్యువాత పడేవి. దీనిపై విమర్శలు రావడంతో టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు ఆదేశాల మేరకు చిన్నపాటి ప్లాస్టిక్‌ నీటి తొట్టెలు అమర్చారు. వీటిచుట్టూ సిమెంట్‌ ప్యాకింగ్‌ చేపట్టారు. వీటికి రోజూ టీటీడీ లారీల ద్వారా నీటిని నింపుతున్నారు. మూగజీవులు తాగునీటి కోసం వీటిపైనే ఆధారపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement