టీసీల కోసం విద్యార్థుల తిప్పలు | Sakshi
Sakshi News home page

టీసీల కోసం విద్యార్థుల తిప్పలు

Published Fri, May 19 2017 2:20 PM

Students faced the problem with taking TC in schools

వరంగల్‌ చౌరస్తా: పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులు టీసీ(బదిలీ సర్టిఫికెట్‌) కోసం నానా తిప్పలు పడుతున్నారు. వారం రోజులుగా వరంగల్‌ మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాఠశాల గేటు ఎదుట పడిగాపులు కాసిన విద్యార్థులు,  తల్లిదండ్రులు గురువారం హెచ్‌ఎం చాంబర్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 39 మంది పదో తరగతి విద్యార్థులుండగా 29 మం ది ఉత్తీర్ణులయ్యారు. ఈ నెల 3న ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. పాలిటెక్నిక్, బాసర త్రిపుల్‌ ఐటీ తదితర ఎంట్రెన్స్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు టీసీల కోసం ఎదురు చూస్తున్నారు.

వివిధ అర్హత పరీక్షలు రాసిన విద్యార్థులు కౌన్సెలింగ్‌ గడువు దగ్గర పడటంతో టీసీల కోసం ఎదురు చూస్తున్నారు. పలుమార్లు హెచ్‌ఎంకు ఫోన్‌ చేయగా ఈ నెల 14న పాఠశాలకు విచ్చేశారు. కేవలం నలుగురు విద్యార్థులకు టీసీలు జారీ చేశారు. అవి కూడా అసంపూర్తి వివరాలతో తప్పుల తడకగా ఉన్నాయి. టీసీల కోసం మిగిలిన విద్యార్థులు నానా ఇబ్బందుల పడుతున్నారు. వారం రోజులుగా పాఠశాల అవరణలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ హెచ్‌ఎం, సిబ్బంది జాడ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడిచినా హెచ్‌ఎం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ...
పదో తరగతి ఫలితాలు వెలువడిన తరువాత నుంచి ఆయా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎం, సీనియర్‌ ఉపాధ్యాయుడు లేదా క్లర్కు, అటెండర్లు అందుబాటులో ఉండాలి. అందుకోసం ప్రభుత్వం సంపాదిత సెలవుల(ఎర్న్‌డ్‌ లీవ్స్‌) రూపేణా వేలాది రూపాయలు చెల్లిస్తోంది. అయినప్పటికీ కొన్ని పాఠశాలల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

హెచ్‌ఎం పాఠశాలకు హాజరుకాకున్నా సంపాదిత సెలవు జీతాలను తీసుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. హెచ్‌ఎం వ్యవహార శైలితో తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు  టీసీలు సమర్పించాల్సిన అవసరం ఉంది.  

Advertisement
Advertisement