విభజనపై వాయిదా పద్ధతే! | Stuck on the method of separation! | Sakshi
Sakshi News home page

విభజనపై వాయిదా పద్ధతే!

Nov 9 2015 12:22 AM | Updated on Aug 18 2018 8:05 PM

విభజనపై వాయిదా పద్ధతే! - Sakshi

విభజనపై వాయిదా పద్ధతే!

గిరిజన సహకార కార్పొరేషన్ (జీసీసీ)ను విభజించకుండా ఏపీ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. రాష్ర్ట విభజన జరిగి 17 నెలలు గడిచినా

♦ గిరిజన కార్పొరేషన్ విభజనకు ఏపీ మెలిక
♦ షీలాభిడే కమిటీ నిర్దేశించినా పట్టించుకోని వైనం  
♦ ఉమ్మడి ఆస్తుల పంపకానికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట
♦ కొత్త పీఆర్‌సీ అమలుకాక నిరాశలో రాష్ట్ర ఉద్యోగులు
 
 సాక్షి, హైదరాబాద్: గిరిజన సహకార కార్పొరేషన్ (జీసీసీ)ను విభజించకుండా ఏపీ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. రాష్ర్ట విభజన జరిగి 17 నెలలు గడిచినా, జీసీసీ విభజనను ఎప్పటికప్పుడు వాయిదావేస్తోంది. విభజనను పూర్తిచేసి తెలంగాణకు చెందాల్సిన దానిని అప్పగించాలని షీలాభిడే కమిటీ ఏపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఈ విభజన జరిగితే వెంటనే తెలంగాణకు రూ.33 కోట్లు ఏపీ చెల్లించాల్సి ఉండటంతో, ఏవో సాకులతో విభజనను ఏపీ వాయిదా వేస్తోంది. దీంతో తెలంగాణ జీసీసీ ఉద్యోగులకు సవరించిన పీఆర్‌సీ అమలుకాలేదు.

జీసీసీకి సంబంధించిన ఆస్తులు, అప్పులు, సిబ్బంది తదితర పది అంశాలు రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశమయ్యాయి. అయితే మూడు అంశాలు ప్రధానమైనవిగా పేర్కొంటూ తెలంగాణ జీసీసీ షీలాభిడే కమిటీ దృష్టికి తెచ్చింది. అందులో ఒకటి  2014,జూన్ 2 నాటికి రిటైరైన ఉద్యోగుల పదవీవిరమణ ప్రయోజనాలను అవశేష ఏపీ ప్రభుత్వమే చెల్లించాలి. రెండోది.. ఉమ్మడి జీసీసీలో తెలంగాణ నుంచి కొనుగోలు చేసిన రూ.3 కోట్ల విలువైన గమ్‌కరయ (తప్సిజిగురు)ను విక్రయించనందున ఆ మొత్తాన్ని 58:42 నిష్పత్తిలో తెలంగాణకు చెల్లించాలి. ఇక మూడోది, ఉమ్మడి జీసీసీ ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉన్నందున గతంలో విశాఖలో కొనుగోలు చేసిన వెయ్యి గజాల ఖాళీ స్థలాన్ని 58:42 నిష్పత్తిలో పంపిణీ చేయాలని పేర్కొన్నారు.

ఈ మూడు అంశాలపై ఎలాంటి వివాదం లేదని షీలాభిడే ఎక్స్‌పర్ట్ కమిటీ నిర్ధారించి విభజన పూర్తిచేయాలని గత ఆగస్టు 31న ఆదేశించింది. అయితే ఆ తర్వాత విభజనకు సంబంధించిన సమావేశాలకు ఏపీ ప్రతినిధులు హాజరుకాకుండా వాయిదాలు వేస్తున్నారు. కాగా, పదవీ విరమణ పొందిన జీసీసీ ఉద్యోగులు పెన్షన్, ఇతర ప్రయోజనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. కిందిస్థాయిలో పనిచేసిన ఉద్యోగులు తమ ఇళ్లలోని వస్తువులను అమ్ముకుని జీవనాన్ని గడపాల్సిన దుస్థితిలో ఉన్నారు. పింఛన్ కోసం హైదరాబాద్‌లోని జీసీసీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement