కొలువుదీరిన పాలకమండలి

కొలువుదీరిన పాలకమండలి


సిద్దిపేట మున్సిపల్ చైర్మన్‌గా రాజనర్సు ప్రమాణం

వైస్ చైర్మన్‌గా ఖాజా అక్తర్ పటేల్..

ఎన్నుకున్న సభ్యులు.. ఆ వెంటనే ప్రమాణ స్వీకారం

అభినందించిన మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట జోన్: సిద్దిపేట మున్సిపాల్టీలో సంపూర్ణ మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్ అధిష్టానం విధేయతకే పట్టం కట్టింది. సిద్దిపేట మున్సిపాల్టీ 10వ చైర్మన్‌గా కడవేర్గు రాజనర్సు, వైస్ చైర్మన్‌గా ఖాజా అక్తర్ పటేల్‌ను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా శనివారం జెడ్పీ సీఈఓ వర్షిణి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. చైర్మన్, వైస్ చైర్మన్  పదవులకు పార్టీ నుంచి, కౌన్సిల్ సభ్యుల నుంచి ఎలాంటి పోటీలేక పోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. నిర్ణీత సమయం 11 గంటలకు కౌన్సిల్ సభ్యుల హాజరు తీసుకున్న ఎన్నికల అధికారులు చైర్మన్ ప్రక్రియను 45 నిమిషాల్లో పూర్తి చేశారు.


అదే విధంగా 11.45కు వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారిక ప్రకటన చేసి 30 నిమిషాల్లో ప్రక్రియను పూర్తి చేశారు.  16వ వార్డు కౌన్సిలర్ కడవేర్గు రాజనర్సును మున్సిపల్ చైర్మన్‌గా, 13వ వార్డు కౌన్సిలర్ వెంకట్‌గౌడ్ ప్రతిపాదించడం మరో సభ్యుడు, 10వ వార్డు మచ్చవేణుగోపాల్‌రెడ్డి బలపర్చడంతో రాజనర్సు చైర్మన్‌గా ఏకగ్రీవమైంది. అదే విధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం  12వ వార్డు కౌన్సిలర్ ఖాజా అక్తర్ పటేల్‌ను పదవ వార్డు కౌన్సిలర్ మచ్చవేణుగోపాల్‌రెడ్డి ప్రతిపాదించగా, 32వ వార్డు కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ బలపర్చారు. రెండు పదవులకు నిర్ణీత సమయంలో కౌన్సిల్ సభ్యుల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు, అభ్యంతరాలు రాకపోవడంతో ప్రిసైండింగ్ అధికారి వర్షిణి ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలను స్వీకరించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్, వైస్‌చైర్మన్లను ఎక్స్ అఫీషియో సభ్యులు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అభినందించారు.


ప్రజల మన్ననలు పొందండి

నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ నూతన పాలక వర్గం ప్రజల మధ్య ఉన్నదని, ప్రజల సమస్యలను పరిష్కరించి వారి మన్ననలను పొందాలన్నారు. సిద్దిపేట మున్సిపాల్టీని రాష్ట్రానికే ఆదర్శంగా నిలపలన్నారు. ప్రజల్లో ఉండే మనిషికి ప్రజాభిమానం లభిస్తుందన్నారు. అదే విధంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌లు అభినందనలు అందజేశారు. 


 కడవేర్గు రాజనర్సు

సిద్దిపేట పట్టణానికి చెందిన రాజనర్సు వార్డు కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మంత్రి హరీశ్‌రావుకు రాజనర్సు అత్యంత సన్నిహితుడు. గత 20 సంవత్సరాలుగా రాజనర్సు కేసీఆర్ అనుచరుడిగా కొనసాగారు. గత పాలక వర్గం చైర్మన్‌గా పట్టణాభివృద్ధికి కృషి చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం ఆయనకు రెండవసారి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్‌గా ఆవకాశం కల్పించింది.


అక్తర్ పటేల్..

సిద్దిపేట పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఖాజా అక్తర్ పటేల్ రెండవ సారి కౌన్సిల్‌లోకి అడుగుపెట్టారు. గత కౌన్సిల్‌లో సభ్యునిగా పనిచేసిన అక్తర్ ఈ సారి ఎన్నికల్లో మైనార్టీ కోటా కింద వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top