మంజూరు పత్రాలు చూపితేనే ఉచిత ఇసుక | showing the grant papers must for free sand | Sakshi
Sakshi News home page

మంజూరు పత్రాలు చూపితేనే ఉచిత ఇసుక

May 2 2017 12:05 AM | Updated on Sep 5 2017 10:08 AM

సాధారణ ప్రజలు గృహలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక తరలించుకోవాలంటే మంజూరు పత్రాలను విధిగా చూపించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): సాధారణ ప్రజలు గృహలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక తరలించుకోవాలంటే మంజూరు పత్రాలను విధిగా చూపించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ముందుగా జిల్లాలో ఎన్ని ఇసుక రీచ్‌లు ఉన్నాయి.. ఏఏ రీచ్‌ నుంచి ఎన్ని క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వారు.. ఎక్కడికి తీసుకెళ్లారు.. తదితర వివరాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపుపై పత్రికల్లో వచ్చే కథనాలపై స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, దినపత్రికల క్లిప్పింగ్‌లను కైజాల యాప్‌ ద్వారా సంబంధిత డివిజన్‌లకు పంపాలన్నారు. ఓర్వకల్లు, గుడికంబాలి, నదిచాగి, నందవరం తదితర రీచ్‌లకు సంబంధించి భూగర్భ జల శాఖ డీడీ రవీంద్రరావు వాల్టా చట్టాన్ని వివరించారు. గతంలో అక్రమంగా ఇసుక తరలించే ఐదు వాహనాలను సీజ్‌ చేశామని, అదేవిధంగా సామర్థ్యానికి మించి అధికంగా ఇసుక తీసుకెళ్లే రెండు వాహనాలు సీజ్‌ చేశామని మైనింగ్‌ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ.. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందుకు అధికారులు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు మైనింగ్‌ ఏడీ వెంకటరెడ్డి, కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు హుసేన్‌సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement