అమ్మో.. ర్యాగింగ్ భూతం!
నెల్లూరు(అర్బన్): నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. ర్యాగింగ్ పేరిట జూనియర్లను సీనియర్లు హింసిస్తున్నారు. పవిత్రమైన వైద్య విద్యను అభ్యసించాల్సిన చోట ర్యాగింగ్ పేరిట రెండు గ్రూపులుగా మారారు. ర్యాగింగ్ గొడవ గత పదిహేనురోజులుగా జరుగుతున్నప్పటికీ అధికారులు నిలువరించలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జూనియర్లు, వారి తల్లిదండ్రులు సోమవారం నేరుగా ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. ఐదుగురు విద్యార్థులపై కేసునమోదు చేయాలని ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు మహిళా మెడికో విద్యార్థులపై ఫిర్యాదు చేస్తూ వారిని మందలించాలని కోరారు. దీంతో నిషేధంలో ఉన్న ర్యాగింగ్ విషయం రాష్ట్రంలో మరోసారి సంచలనమైంది.
మాట వినకపోతే కొడుతున్నారు
గత పదిహేనురోజులుగా సీనియర్లు జూనియర్లను బెదిరిస్తూ పనులు చేయించుకుంటున్నారు. అంగడికి పోయిరమ్మనడం, దుస్తులు ఉతకమనడం, రన్నింగ్ చేయమని చెప్పడం లాంటివి చేస్తున్నారు. తినే భోజనాన్ని లాగేయడం , బోర్డులపై బొమ్మలేయమనడం చేశారు. మాట వినకపోతే గదిలో ఉంచి కొడుతున్నట్టు ఫిర్యాదులందాయి. సీనియర్ మహిళా విద్యార్థులు కూడా తమ జూనియర్లను ఇబ్బందులు పెట్టారు. దీంతో బాధలు భరించలేని జూనియర్స్ తిరగబడ్డారు. ఈనెల 22న పెద్దఎత్తున గొడవ జరిగింది. సీనియర్లు, జూనియర్లు నెట్టుకున్నారు. ఆరోజే జూనియర్లు ప్రిన్సిపాల్ కృష్ణమూర్తిశాస్త్రీకి సీనియర్లపై ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ విచారించి మందలించారు. ఆరోజే సస్పెండ్ చేస్తామని హెచ్చరించడంతో సీనియర్లు ప్రిన్సిపాల్‌ను బతిమాలుకుని ఇక మీదట తప్పు చేయమని లెంపలేసుకున్నారు. దీంతో వదిలేశారు.
చంపేస్తామంటూ బెదిరింపులు
ఆదివారం రాత్రి మరోమారు హాస్టల్‌లో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు జూనియర్లు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఒక మెడికో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సీనియర్లు తాగొచ్చి తనను చంపేస్తామంటున్నారని వాపోయాడు. దీంతో విద్యార్థి తండ్రి 200 కిలోమీటర్ల నుంచి రాత్రికిరాత్రే బయలుదేరి నెల్లూరు వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఇలా పలువురు జూనియర్ల తల్లిదండ్రులు సోమవారం కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. ప్రిన్సిపాల్ తాను చేపట్టిన చర్యలు గురించి వారికి వివరించి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఈలోపు ఘర్షణ పెద్దదైంది. పోలీసులు రంగప్రవేశం చేశారు.
పోలీసుస్టేషన్‌కు విద్యార్థుల తరలింపు
ర్యాగింగ్‌కి ప్రధాన కారకులంటూ తల్లిదండ్రులు సందీప్‌సాగర్, యాహియా, ఉదయభాస్కర్, సాయికిశోర్, సాయితేజ అనే సీనియర్లపై ఫిర్యాదుచేశారు. వారిని అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. మరో ఇద్దరు అమ్మాయిలు నోయిల్, ప్రసన్నతేజలకు వార్నింగ్ ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసి సాయంత్రం వరకు ఐదో నగర పోలీసుస్టేషన్‌లో ఉంచారు. ఈలోపు ఇరువర్గాల తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ చర్చలు జరిపారు. విద్యార్థుల భవిష్యతు దెబ్బతింటుందని నచ్చజెప్పారు. ఐదుగురిని రెండు నెలల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ ప్రిన్సిపాల్ ప్రకటించారు. దీంతో శాంతించిన జూనియర్ల తల్లిదండ్రులు కేసు ఉపసంహరించుకున్నారు. సీనియర్ల తల్లిదండ్రుల చేత ఇక భవిష్యత్‌లో ఎలాంటి తప్పులు చేయబోమని లెటర్లు రాయించుకుంటామని ప్రిన్సిపాల్ ప్రకటించారు.