సారథి ఎవరో?

సారథి ఎవరో? - Sakshi


కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం మల్లగుల్లాలు

పగ్గాలు ఆశిస్తున్న నేతల సమర్థతపై మదింపు

11వ తేదీలోపు బీజేపీకి కొత్త అధ్యక్షుడు


 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని భారతీయ జనతాపార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నెల 6న గానీ 10వ తేదీన గానీ జిల్లా అధ్యక్ష పదవికి కొత్త సారథిని ఎంపిక చేసేందుకు ప్రాథమికంగా ముహూర్తం ఖరారు చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు అంజన్‌కుమార్ పదవీకాలం కొన్నాళ్ల క్రితమే ముగిసిన ప్పటికీ, శాసనమండలి, గ్రేట ర్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెలలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగేలోపు సంస్థాగత ఎన్నికల పర్వాన్ని పూర్తిచేయాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది.


దీంతో కొత్త దళపతిని ఎన్నుకునేందుకు ఈనెల 5న ముఖ్యనేతలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం సాధించడం ద్వారా సారథి ఎంపికకు మార్గం సుగమం చేయాలని నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు అధ్యక్ష పదవి నిర్వర్తించిన అంజన్‌కుమార్‌కు మరోసారి చాన్స్‌లేనందున.. ఈసారి పార్టీ పగ్గాలు చేపట్టడానికి నలుగురు నేతలు అగ్రనాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు, శంకర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి అర్జున్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి తదితరులు పార్టీ పదవి కోసం తమైదె న శైలిలో పావులు కదుపుతున్నారు.


 బలహీన సారథ్యం!

బీజేపీకి రంగారెడ్డిలో సంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంకు, సమర్థంగా పనిచేసే శ్రేణులు ఉన్నప్పటికీ  జిల్లా నాయకత్వం పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ జిల్లాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పోరాటాలు చేయలేకపోయింది. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. దిగువశ్రేణి నాయకులతో కలుపుగోలుగా వ్యవహరించకపోవడం.. కేవలం కేంద్ర పార్టీ కార్యాల యానికే పరిమితం కావడంతో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయలేకపోయింది. జిల్లాలో బలీయశక్తిగా ఉన్న టీడీపీ దాదాపుగా ఉనికి కోల్పోవడం, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా పోరాట పటిమ ప్రదర్శించలేక చతికిల పడుతున్న సమయాన్ని అందిపుచ్చుకొని ఎదగడానికి పార్టీ నాయకత్వం ప్రయత్నించడంలేదనే వాదన కాషాయశ్రేణుల్లో వినిపిస్తోంది.


 పీఠాధిపతులెవరో..!

పార్టీ కుర్చీపై కన్నేసిన నలుగురూ యువనాయకులే. రాష్ట్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్న బొక్క నర్సింహారెడ్డి పార్టీ పగ్గాల కోసం గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ అగ్రనాయకుల ఆశీస్సులను నమ్ముకున్న ఆయన తనదైన శైలిలో లాబీయింగ్ నెరుపుతున్నారు. ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంతో జిల్లాలోని ఇతర నాయకుల మద్దతు కూడా తనకే దక్కుతుందనే భరోసాతో ఉన్నారు. ఇక బాలాపూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ శంకర్‌రెడ్డి ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ పదవి తనకే ఖరారవుతుందనే విశ్వాసంతో ఉన్నారు. క్రితం సారి చివరి నిమిషంలో పార్టీ పగ్గాలు చేజారాయని, సీనియర్ నేతలు బద్దం బాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరుల ఆశీస్సులతో జిల్లా సారధ్యం దక్కుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు.


ఇక గతంలోనూ జిల్లా కుర్చీని ఆశించి భంగపడిన కరణం ప్రహ్లాదరావు ఈసారి కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీనియర్ నేతగా ఆయనకు అవకాశం కల్పించాలని పార్టీలోని ఒకవర్గం ఒత్తిడి తెస్తోంది. కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి అర్జున్‌రెడ్డి కూడా రేసులో ముందంజలో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి వివిధ పదవులు నిర్వర్తించిన అనుభవం ఉన్నందున.. అధ్యక్ష పదవిపై గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి కూడా సారథ్య బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో  ఆశావహుల సమర్థతను మదింపు చేసిన తర్వాత కొత్త సారథిని ఎన్నుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఏదీఏమైనా ఈ నెల 11వ తేదీలోపు నూతన అధ్యక్షుడెవరనేది స్పష్టం కానుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top