జిల్లాలో ఇసుక తుఫాన్‌! | sand toofan at nagepalli | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఇసుక తుఫాన్‌!

Jul 2 2017 11:11 PM | Updated on Aug 28 2018 8:41 PM

జిల్లాలో ఇసుక తుఫాన్‌! - Sakshi

జిల్లాలో ఇసుక తుఫాన్‌!

ఆషాడం.. వచ్చిదంటే ఆ ఊళ్లో ప్రజలకు వణుకుపుడుతోంది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే గాలుల తీవ్రతకు గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు దూరమైంది.

నాగేపల్లి వద్ద రోడ్డును కప్పేసిన ఇసుక
ఆషాడ గాలులతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
గాలుల తీవ్రతకు ఇళ్లపై ఇసుక మేటలు


ఆషాడం.. వచ్చిదంటే ఆ ఊళ్లో ప్రజలకు వణుకుపుడుతోంది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే గాలుల తీవ్రతకు గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు దూరమైంది. గాలులతో పాటు ఇసుక ఎగిసి వచ్చి రోడ్లు, గృహాలను కప్పేస్తుండడంతో జనం ఇక్కట్లు చెప్పనలవి కావడం లేదు. ఇసుక తుఫాన్‌ తాకిడికి జనం బెంబేలెత్తుతున్నారు. రూ. కోట్లు వెచ్చించి ఎడారీకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడతున్నా.. ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.
- కణేకల్లు (రాయదుర్గం)

రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహళ్‌ మండలాల్లో వేదవతి హగిరి పరివాహక ప్రాంత గ్రామాల్లోని ప్రజలు ఆషాడం గాలులకు కుదేలవుతున్నారు. నదీ తీర ప్రాంతాల్లో బలమైన గాలులకు ఇసుక ఎగసి పడుతుండటంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ఈ సీజన్‌లో పలుచోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్డును సైతం ఇసుకమేటలు కప్పేస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా మారుతోంది.

15 వేల ఎకరాల్లో ఇసుక మేటలు
కణేకల్లు మండలంలోని మాల్యం, నాగేపల్లి, తుంబిగనూరు, గరుడచేడు, మీన్లహళ్లి, బిదరకుంతం, దర్గాహోన్నూరు, గోవిందవాడ, బల్లనగుడ్డం తదితర గ్రామాల్లో సుమారు 15వేల ఎకరాల్లో ఇసుకమేటలు విస్తరించి ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం వేదవతి హగిరి పరివాహకప్రాంతంలో కుండ పోత వర్షాలకు వేదవతి నదిలో భారీగా వరదనీరు ‍ప్రవహించింది. ఆ సమయంలో వేదవతి హగిరి పరివాహక ప్రాంతంలోని ఇసుక పెద్ద ఎత్తున ఇక్కడకు తోసుకువచ్చింది. చిన్నచిన్న ఇసుక రేణువులతో ఈ ప్రాంతంలో ఇసుకమేటలు విస్తరించి... ఇసుకకొండలుగా మారాయి.  మిగిలిన సీజన్‌లలో ఏలాంటి ఇబ్బందులు లేకున్నా... ఆషాడంలో మాత్రం ఇక్కడ ఇసుక తుఫాన్‌లు చెలరేగుతుంటాయి.

రోజంతా ఇసుక తుఫాన్‌
బలమైన గాలులకు ఇసుక రేణువులు ఎగిసి ఓ తుఫాన్‌లా ముందుకు సాగుతూ గ్రామాలను చుట్టుముడుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకూ రోజంతా ఇసుక తుఫాన్‌ వాతావరణం నెలకొని ఉంటుంది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులను ఇసుక కప్పేస్తుంటుంది. ఈ ప్రాంతం దాటే వరకూ ఇసుకలో మునిగి తేలాల్సిందే. ఇసుక తుఫాన్‌ దెబ్బకు ద్విచక్ర వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ వాడుతున్నారు. ఈ ప్రాంతం దాటగానే వారి శరీరంపై ఉన్న దుస్తుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుక వెలికి వస్తుంది. బలమైన గాలులకు పొలాల్లోని ఇసుక ఇళ్ల మీద పడుతోంది. ఇంటి ఆవరణం, గవాచీ, కిటికీల ద్వారా ఇసుక ఇళ్లలో చేరుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇళ్లను సైతం ఇసుక మేటలు కప్పేస్తుంటుంది. ప్రధానంగా మాల్యం–నాగేపల్లి, దర్గాహోన్నూరు–గోవిందవాడ, బల్లనగుడ్డం వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఇసుక వచ్చేస్తుండటంతో వాహనదారులు రోడ్డు దాటేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తతో వెళ్లిన ప్రమాదాలకు గురికాక తప్పదు.

రక్షణగోడల ఏర్పాటు ఏదీ?
ఇసుకతో ఆర్‌అండ్‌బీ రోడ్డు బ్లాక్‌ అయ్యే ప్రాంతాల్లో రక్షణగోడలు నిర్మించాలన్న ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉన్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. రోడ్డుకు పై భాగంలో పెద్ద ఎత్తున పొడువుగా ప్రొటక్షన్‌వాల్‌ నిర్మిస్తే ఇసుకంత ఆ వాల్‌ వద్దకు వచ్చి పడుతోందని రోడ్డుపై రాదని అధికారుల అభిప్రాయం. ఈ మేరకు రెండు, మూడు చోట్ల ప్రొటక్షన్‌వాల్‌ నిర్మిస్తామని గతంలో అధికారులు ప్రకటించారు. ఐతే నేటికి ఎక్కడ నిర్మించింది లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement