ఇసుక దోపిడీపై టీడీపీలోనే ఆగ్రహ జ్వాల! | TDP party worker fires on TDP MLA Kuna Ravikumar | Sakshi
Sakshi News home page

ఇసుక దోపిడీపై టీడీపీలోనే ఆగ్రహ జ్వాల!

Jun 3 2025 5:56 AM | Updated on Jun 3 2025 5:56 AM

TDP party worker fires on TDP MLA Kuna Ravikumar

జేసీ ఎదుట రూ.లక్షా 50వేలు బయటికి తీసిన టీడీపీ సీనియర్‌ కార్యకర్త సనపల సురేశ్‌

ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై పార్టీ కార్యకర్త ఆగ్రహం

లంచమిస్తేనే చర్యలంటే.. అందుకూ రెడీ అంటూ ఆవేదన

జాయింట్‌ కలెక్టర్‌ ముందు జేబులోంచి రూ.1.50లక్షలు బయటకు..

తప్పుడు ఫిర్యాదు చేస్తే తనపైనే చర్యలు తీసుకోవాలని సవాల్‌

శ్రీకాకుళం జిల్లాను హీటెక్కించిన ఘటన

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఇసుక దోపిడీపై టీడీపీ శిబిరంలోనే అసంతృప్తి భగ్గుమంటోంది. జిల్లా రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో  టీడీపీ కార్యకర్త సనపల సురేశ్‌ తన సొంత పార్టీకి చెందిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఆయన అనుచరులపై ఇసుక దోపిడీకి సంబంధించి నేరుగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. లంచం లేకపోతే చర్యలు ఉండవంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, జాయింట్‌ కలెక్టర్‌  ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ తదితర అధికారుల సమక్షంలోనే రూ.1.50లక్షల నగదు జేబులోంచి బయటకు తీయడం మరింత సంచలనం రేపింది.  

లంచమిస్తా.. చర్యలు తీసుకోండి: సనపల సురేశ్‌
గ్రీవెన్స్‌ సెల్‌లో సురేశ్‌ మాట్లాడుతూ, ‘ఇసుక అక్రమ తవ్వకాలను ఆపండి. ఇప్పటికే ఎన్నో సార్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాను. మైనింగ్‌ అధికారులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నాను. కానీ చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక అక్రమాలను అడ్డుకుంటున్నానని ఎమ్మెల్యే అనుచరులు నాపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. నాపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు కూడా తీసుకోవడం లేదు.

ఒకవేళ తప్పుడు ఫిర్యాదులు చేశాననుకుంటే నాపై చర్యలు తీసుకోండి. లంచాలకు అలవాటు పడి ఇసుక అక్రమాలను అడ్డుకోవడం లేదు. అదే లంచం నేను ఇస్తాను.. చర్యలు తీసుకోండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ‘ఇదిగో.. లంచం అంటూ’ తన జేబులో నుంచి రూ.1.50 లక్షలు తీసి ఇవ్వడానికి సిద్ధమవడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. సుదీర్ఘకాలంగా టీడీపీకి విధేయుడిగా, సీనియర్‌ కార్యకర్తగా కొనసాగుతున్న సురేశ్,  ఇసుక అక్రమాలను చూసి తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. 

వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో అడ్డగోలు తవ్వకాలు
వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇష్టారీతిన తవ్వకాలతో ఎక్కడికక్కడ భారీ గోతులు ఏర్పడి దీవుల్లా కనిపిస్తున్నాయి. వందలాది లారీల రవాణాతో రోడ్లన్నీ ఛిద్రమైపోతున్నాయి. ఒక్క ఆమదాలవలస నియోజకవర్గంలోనే ఇసుక ద్వారా రోజుకి రూ.50 లక్షలకు పైగా  తెలుగు తమ్ముళ్లు అక్రమంగా ఆర్జిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. అనుమతులిచ్చిన ర్యాంపుల గడువు ముగిసినప్పటికీ తవ్వకాలు ఆపడం లేదు. డీసిల్టేషన్‌ పాయింట్‌లోనైతే పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారు.  పరిమితికి మించి లోడింగ్, రవాణా చేయడంతో లారీల చక్రాలు కూడా విరిగిపోతున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement