
టీజీఎండీసీలో ఏకీకృత పర్యవేక్షణ వ్యవస్థ
ఇసుక తవ్వకాలు, నిలువ, విక్రయాల్లో పారదర్శకత లక్ష్యంగా ప్రణాళికలు
జీపీఎస్ లేని వాహనాలను సులువుగా గుర్తించేందుకు దోహదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక వెలికితీత, విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇసుక వెలికితీత, రవాణాలో ఉపయోగించే వాహనాల జీపీఎస్ సమాచారాన్ని ఏకీకృతం చేసి పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని భావిస్తోంది. ఆయా వాహనాలు జీపీఎస్ వ్యవస్థను అమర్చుకోవడాన్ని టీజీఎండీసీ ఇదివరకే తప్పనిసరి చేసింది. వేర్వేరు జీపీఎస్ ప్రొవైడర్ల ద్వారా ఈ వాహనాల్లో జీపీఎస్ పరికరాలను అమర్చారు.
అయితే ఈ ప్రొవైడర్ల వద్ద ఉన్న వాహనాల కదలికల సమాచారం టీజీఎండీసీ వద్ద ఏకీకృతంగా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఇసుక రవాణా, వెలికితీతలో నిమగ్నమైన వాహనాల వివరాలను తమ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ) సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేయాలని జీపీఎస్ ప్రొవైడర్లను టీజీఎండీసీ ఆదేశించింది.
రియల్ డేటాను పంచుకోవాలి
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకం, నిలువ, విక్రయాల్లో సుమారు 40వేలకు పైగా యంత్రాలు, రవాణా వాహనాలు నిమగ్నమై ఉన్నాయి. వీటిలో 70శాతానికి పైగా వాహనాల్లో వివిధ జీపీఎస్ ప్రొవైడర్ల ద్వారా పరికరాలను అమర్చారు. టీజీఎండీసీ రూపొందించిన ఏపీఐతో అనుసంధానం చేయడం ద్వారా వాహనాల కదలికల (రియల్ టైమ్ డేటా) సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తద్వారా కేంద్రీకృత వాహన పర్యవేక్షక వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలవుతుంది.
అయితే ఇప్పటివరకు 8 వేల వాహనాల జీపీఎస్ డేటా మాత్రమే ఏపీఐతో అనుసంధానమైంది. ఈ నేపథ్యంలో మిగతా వాహనాల జీపీఎస్ సమాచారాన్ని కూడా ఏపీఐతో అనుసంధానం చేసేందుకు జీపీఎస్ ప్రొవైడర్లతో టీజీఎండీసీ సంప్రదింపులు జరుపుతోంది. 30 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించింది.
జీపీఎస్ లేని వాహనాల గుర్తింపు
జీపీఎస్ వాహన పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఇసుక రవాణాలో జీపీఎస్ పరికరాలను లేకుండా పాల్గొంటున్న వాహనాలను గుర్తించడం సాధ్యమవుతుందని టీజీఎండీసీ భావిస్తోంది. జీపీఎస్ డేటా ఏకీకృతం కాకపోవడంతో జరుగుతున్న నష్టాలను అధిగమించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఏపీఐతో అనుసంధానమయ్యే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు, కో ఆర్డినేట్లు (అక్షాంశాలు, రేఖాంశాలు) తదితరాలను జీపీఎస్ ప్రొవైడర్లు అందజేయాల్సి ఉంటుంది.