కర్ణాటకకు ఆర్టీసీ బస్సు సర్వీసుల తగ్గింపు | Sakshi
Sakshi News home page

కర్ణాటకకు ఆర్టీసీ బస్సు సర్వీసుల తగ్గింపు

Published Tue, Sep 13 2016 1:29 AM

కర్ణాటకకు ఆర్టీసీ బస్సు సర్వీసుల తగ్గింపు - Sakshi

అనంతపురం టౌన్‌ : తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య రగిలిన కా‘వేడి’ అనంతకూ తాకింది. కర్ణాటకలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడి ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా నుంచి కర్ణాటకకు 73 సర్వీసులు నడుపుతుండగా సగం వరకు మాత్రమే నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలవివాదం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. తాజాగా తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ నెల 20 వరకు తమిళనాడుకు నీటిని వదలాల్సిందేనని కర్ణాటకకు ఆదేశిస్తూ తదుపరి విచారణను 20కి వాయిదా వేసింది.

ఈ క్రమంలో కర్ణాటకలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆగ్రహానికి తమిళనాడుకు చెందిన సుమారు 40 బస్సులు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన అనంతపురం ఆర్టీసీ అధికారులు అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. బెంగళూరులో ఉండే అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌తో మాట్లాడారు. ప్రస్తుతం మెజిస్టిక్‌ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని, తమిళనాడు రిజిస్ట్రేషన్‌ కలిగిన వాహనాలను ఆందోళనకారులు దగ్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. పైగా మంగళవారం బక్రీద్‌ సెలవుతో పాటు అక్కడి ఐటీ కంపెనీలు కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలో అనంతపురం నుంచి ఆర్టీసీ సర్వీసులను తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. పరిస్థితి సద్దుమణిగే వరకు బస్‌ సర్వీసులను తక్కువగానే నడుపుతామని ఆర్టీసీ ఆర్‌ఎం చిట్టిబాబు ‘సాక్షి’కి తెలిపారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement