పులుల లెక్కింపుపై సమీక్ష
నల్లమల అటవీ పరిధిలో నాలుగో విడత పులుల లెక్కింపుపై కర్నూలు సీసీఎఫ్ జేఎస్‌ఎన్ మూర్తి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆత్మకూరు: నల్లమల అటవీ పరిధిలో నాలుగో విడత పులుల లెక్కింపుపై కర్నూలు సీసీఎఫ్ జేఎస్‌ఎన్ మూర్తి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బైర్లూటీ చెక్‌పోస్టు సమీపంలోని అటవీశాఖకు చెందిన జంగిల్ క్యాంపులో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది రెండుసార్లు పులుల లెక్కింపు జరుగుతుందని, ఇందులో తొలి విడత 45 రోజులు, మరో రోజు 45 రోజుల చొప్పున టైగర్లను గుర్తించడం జరుగుతుందన్నారు. పులుల లెక్కింపు ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారా, నీరు నిల్వ ఉన్న కుంటల వద్ద, సెలయేర్లు, చల్లని ప్రదేశాలలో పులుల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుండ్ల బ్రహ్మేశ్వరం అరణ్యపరిధిలో బఫర్ ఏరియాపై నిర్ణయం తీసుకునేందుకు అ«ధికారులతో సమీక్షించారు. బఫర్ ఏరియా ఏర్పాటు చేస్తే కలిగే వివిధ అంశాలపై అధికారులతో ఆయన ప్రధానంగా చర్చించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ ఎస్డీ శర్వణన్, గుంటూరు సీఎఫ్ రామ్మోహన్‌రావు, ఆత్మకూరు డీఎఫ్‌ఓ సెల్వం, నంద్యాల డీఎఫ్‌ఓ శివప్రసాద్, మార్కాపురం డీఎఫ్‌ఓ జయచంద్ర, గిద్దలూరు డీఎఫ్‌ఓ ఖాదర్‌బాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.