
న్యాయవాదులకు అండగా ఉంటాం
న్యాయాధికారుల, న్యాయవాదుల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని.. పోరాటంలో వారికి అండగా ఉంటామని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
♦ న్యాయాధికారులు, న్యాయవాదుల డిమాండ్లు న్యాయసమ్మతమే
♦ ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
♦ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
ఇబ్రహీంపట్నం : న్యాయాధికారుల, న్యాయవాదుల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని.. పోరాటంలో వారికి అండగా ఉంటామని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైకోర్టును విభజించాలని ఇబ్రహీంపట్నంలో రిలే దీక్షలు నిర్వహిస్తున్న న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సస్పెండ్ చేసిన అధికారులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉన్నామని..
కుల సంఘాలు కూడా వారికి బాసటగా నిలవాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. న్యాయాధికారులు, కోర్టు సిబ్బందికి అన్ని వర్గాల నుంచి సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రిలే నిరహారదీక్షలో న్యాయవాదులు వేణుగోపాల్‌రెడ్డి, వెంకటేష్, మహేందర్, శ్రీనివాస్, రవి, కిషన్, అంజన్‌రెడ్డి, అరుణ్‌కుమార్, 4వ, 22వ మెట్రోపాలిటిన్, స్పెషల్ కోర్టు సూపరింటెండెంట్లు రజని, పద్మ, ఇదయతుల్లాతోపాటు న్యాయవాదులు మోకిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, జగన్‌గౌడ్, జేఏసీ చైర్మన్ చల్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీక్ష చేపట్టిన వారికి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, టీఆర్‌ఎస్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, సతీష్, టీడీపీ నాయకుడు ఎండీ. మోహిజ్‌పాష, బీజేపీ నాయకుడు పోరెడ్డి నర్సింహారెడ్డి, సీపీఐ నాయకుడు మస్కు నర్సింహ, నవ్యపౌండేషన్ అధ్యక్షురాలు శ్రీరమ్య, వేణుగోపాల్‌రావు తదితరులు సంఘీభావం తెలిపారు.