అక్రమ నిర్మాణాలపై కేసు విచారణ సందర్భంగా న్యాయవాదులకు జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సూచన
అక్రమ నిర్మాణాలు భవిష్యత్‌లో పెనుముప్పుగా మారతాయి.. భవిష్యత్ తరాలు క్షమించవు..
పార్కింగ్, అనుమతి లేని నిర్మాణాలతో ఇరుగుపొరుగు మధ్య సఖ్యత లేదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలతో భవిష్యత్‌లో ముప్పు వాటిల్లుతుందని, అలాంటి కేసులు వాదించే ముందు న్యాయవాదులు ఒకసారి ఆలోచించాలని హైకోర్టు సూచించింది. అక్రమ నిర్మాణాలు, పార్కింగ్ లేమితో ఇరుగు పొరుగు మధ్య సఖ్యతే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. జీ ప్లస్ 2 నిర్మాణానికి అనుమతి తీసుకుని మరో రెండు అంతస్తులు ఎలా నిర్మిస్తారని అక్రమ నిర్మాణదారును ప్రశ్నించింది. పిటిషనర్, అక్రమ నిర్మాణదారు అన్నదమ్ములని న్యాయవాది చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలుంటే ఇలా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించింది.
కాలానుగుణంగా విప్లవాలు వస్తుంటాయని, ఇప్పుడు అక్రమ నిర్మాణాల వసూళ్ల విప్లవం సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణకు అన్నదమ్ములిద్దరూ హాజరుకావాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం పర్వతపురంలో 175 గజాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ బి.సంజీవ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు.
ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్‌లో పెను ముప్పుగా మారనుందని, ఆ తరాలు ఇప్పటివారిని క్షమించవని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ అధికారులతోపాటు అక్రమ నిర్మాణదారుల తరఫున వాదించే న్యాయవాదులు ఇది తెలుసుకోవాలని సూచించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు వస్తూ పోతూ ఉంటారని, ఇలాంటి కేసులతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతాయన్నారు. కొందరు భూములను భార్యల పేర కొనుగోలు చేస్తున్నారని, అక్కడ గంజాయి లాంటివి పండిస్తుండటంతో మహిళలు కూడా నిందితుల జాబితాలో చేరుతున్నారన్నారు.


