అర్చక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ అర్చక-ఉద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు నాల్గోరోజుకు చేరాయి.
భద్రాచలం(ఖమ్మం) : అర్చక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ అర్చక-ఉద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు నాల్గోరోజుకు చేరాయి. శుక్రవారం ఖమ్మం జిల్లా భద్రాచలంలో వినూత్న రీతిలో నిరశన తెలిపారు. శ్రావణ శుక్రవారం కావటంతో తమ సమస్యలపై ప్రభుత్వానికి జ్ఞానోదయం కలుగాలని శ్రీమహాలక్ష్మి హోమంను నిర్వహించారు. భద్రాచలంలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమ గుండంను ఏర్పాటు చేసి యాగం జరిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలను అక్కడ ఏర్పాటు చేసి హోమం నిర్వహించటం గమనార్హం.
హోమం అనంతరం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అర్చక, ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ అమలు మేరకు అర్చక, ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భక్తులను అయోమయే పరిచే రీతిలో కొంతమంది విరుద్ధ ప్రకటనలు ఇవ్వటం కూడా సరైంది కాదన్నారు. ప్రభుత్వం దీనిపై సత్వరమే స్పందించాలని కోరారు.