ప్రాధాన్యంపై అలక్ష్యం | pradhanampi alakshyam | Sakshi
Sakshi News home page

ప్రాధాన్యంపై అలక్ష్యం

Jun 21 2017 12:03 AM | Updated on Sep 5 2017 2:04 PM

ప్రాధాన్యంపై అలక్ష్యం

ప్రాధాన్యంపై అలక్ష్యం

భీమవరం/తాడేపలి్లగూడెం :ధాన్యానికి కనీస మద్దతు ధర దక్కేలా చూసేందుకంటూ ప్రభుత్వం తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్య సాధనలో చతికిలపడ్డాయి.

భీమవరం/ తాడేపల్లిగూడెం :ధాన్యానికి కనీస మద్దతు ధర దక్కేలా చూసేందుకంటూ ప్రభుత్వం తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్య సాధనలో చతికిలపడ్డాయి. 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. 9.85 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేశారు. ఇందులో సింహభాగం మిల్లర్లు, కమీషన్‌ వ్యాపారులు కొనుగోలు చేయగా.. ఆ ధాన్యాన్ని కూడా ఐకేపీ కేంద్రాల ద్వారానే సేకరించినట్టు రికార్డుల్లో చూపించారు. మంగళవారం సాయంత్రం నుంచి కొనుగోలు కేంద్రాలన్నిటినీ మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. 1,979 మంది రైతులకు రూ.36 కోట్లను బకాయిపెట్టారు. బకాయిల్ని చెల్లించకుండా ఐకేపీ కేంద్రాలను మూసివేస్తుండటంతో తమకు సొమ్ములు ఎప్పుడు అందుతాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. 
సగం ధాన్యం బయట జిల్లాలకే..
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గడచిన దాళ్వా సీజన్‌లో 5.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టినట్టు.. 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో అంచనాలకు మించి దిగుబడులు వచ్చాయి. ఎకరాకు 40 నుంచి 50 బస్తాల వరకు ధాన్యం పండింది. మొత్తం దిగుబడిలో సగం ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలించారు. మిగిలిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్టు చూపించి కస్టమ్‌ మిల్లింగ్‌కు తీసుకున్నారు. ఇదిలావుంటే.. మొత్తం దిగుబడిలో 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఏప్రిల్‌ 6న ప్రభుత్వం 283 కొనుగోలు కేంద్రాలు తెరిచింది. వీటి నిర్వహణను ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) గ్రూపులకు, సహకార సంఘాలకు అప్పగించింది. వీటిద్వారా బుధవారం నాటికి 84,456 మంది రైతుల నుంచి 9,85,933 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు రికార్డు చేశారు. రైతులకు మొత్తం రూ.1,474 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 1,438 కోట్లు చెల్లించామని, 1979 మంది రైతులకు రూ.36 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 
10 రోజులుగా మందగమనం
గత 10 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. చివరి రోజుల్లో కేవలం సుమారు 75 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఈనెల 8నాటికి 79,843 మంది రైతుల నుంచి రూ.1,363 కోట్ల విలువైన 9,10,824 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. 20వ తేదీ నాటికి 9,85,933 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు రావడం లేదనే కారణంతో బుధవారం నుంచి ఐకేపీ కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement