‘ఆపరేషన్‌ పోలో’కు నేటితో 68 ఏళ్లు | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌ పోలో’కు నేటితో 68 ఏళ్లు

Published Sat, Sep 17 2016 7:43 AM

అప్పటి సికింద్రబాద్ స్టేషన్

సాక్షి, సిటీబ్యూరో: ‘ఆపరేషన్‌ పోలో’... సరిగ్గా 68 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం నిజాం రాజ్యంపై చేసిన పోలీసు చర్య పేరిది. అప్పట్లో దేశమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నా... హైదరాబాద్‌ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పదఘట్టనల కింద నలిగిపోతున్నారు. రజాకార్ల  అకృత్యాలు... రాక్షసకాండ మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. ఆ సమయంలోనే ప్రభుత్వం ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో పోలీసు చర్యకు దిగింది. నిజాం నియంతృత్వ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. హైదరాబాద్‌ సంస్థానంలోనూ స్వేచ్ఛా వాయువులు వీచాయి.

ఇదంతా ఒకవైపు... మరోవైపు నియంతృత్వ పాలన సాగించిన ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో హైదరాబాద్‌ అభివృద్ధికి  సైతం బలమైన పునాదులు పడ్డాయి. విద్య, వైద్యం, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, తదితర రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి కనిపించింది. ఎన్నో చారిత్రక కట్టడాలు వెలిశాయి. రహదారులు, జలాశయాలు నిర్మించారు. నిజాం కాలంలో నియంతృత్వం ఎంత కఠోరమైన వాస్తవమో... అభివృద్ధీ అంతే. సెప్టెంబర్‌ 17వ తేదీన ఆయన భారత ప్రభుత్వానికి లొంగిపోవడంతో నిజాం శకం అంతమైంది.

 భయానకం
హైదరాబాద్‌ రాజ్యంలో ఎన్నో అరాచకాలు... అకృత్యాలు... రక్తపాతం సృష్టించిన రజాకార్లు నగరంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతికేవారు. ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోననే భయం. రాత్రివేళల్లో మహిళలు కారంపొడి దగ్గర ఉంచుకొనే వారు. కాంగ్రెస్‌ సారథ్యంలో వెలువడిన ‘ఇమ్రోజ్‌’ పత్రికలో మజ్లిస్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు, వార్తలు విరివిగా వచ్చేవి. వాటిని ఖాసీం రజ్వీ జీర్ణించుకోలేకపోయాడు.

‘తమకు వ్యతిరేకంగా వార్తలు రాసేవాళ్ల చేతులు నరికేస్తామని’ తీవ్రంగా హెచ్చరించాడు. ఆ తరువాత వారం రోజులకే ఓ అర్ధరాత్రి షోయబ్‌ చేతులు నరికి, పిస్తోలుతో కాల్చి చంపారు రజాకార్లు. ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ నియంతృత్వ పరిపాలనలో ఈ దాడులు చీకటి అధ్యాయం. రాచరిక నియంతృత్వ వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ దిశగా రాజకీయ రంగం పరిణామం చెందింది కూడా ఈ కాలంలోనే కావడం గమనార్హం.

ముగిసిన శకం..
హైదరాబాద్‌ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య 1948 సెప్టెంబర్‌ 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్టినెంట్‌ జనరల్‌ మేజర్‌ రాజేంద్రసింగ్‌ నేతత్వంలో మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నాలుగు వైపుల నుంచి హైదరాబాద్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. షోలాపూర్‌ నుంచి బయలుదేరిన సైన్యం నల్‌దుర్గ్‌ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్‌ మీదుగా హైదరాబాద్‌ వైపు వచ్చింది.

మేజర్‌ జనరల్‌ డీఎస్‌ బ్రార్‌ ముంబై నుంచి... ఆపరేషన్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఎ.ఎ.రుద్ర విజయవాడ వైపు నుంచి... బ్రిగేడియర్‌ శివదత్త బేరార్‌ నుంచి  బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది. భారత ఎయిర్‌ మార్షల్‌ ముఖర్జీ తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. 1948 సెప్టెంబర్‌ 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్‌ ప్రాంతాలలో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి.

సెప్టెంబర్‌ 16న రాంసింగ్‌ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు యూనియన్‌ సైనికుల పాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్‌చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్, తదితర ప్రాంతాల్లో మందుపాతర లు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్‌ ఇద్రూస్‌ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్‌ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించారు. ‘ఆపరేషన్‌ పోలో’ పూర్తయింది


ప్రగతికి బాటలు
చారిత్రక, రాజకీయ, సామాజిక రంగాల్లో నియంతృత్వం రాజ్యమేలుతున్న సమయంలోనే హైదరాబాద్‌ ఆర్థిక అభివృద్ధికీ బలమైన పునాదులు పడ్డాయి. విద్య, వైద్య, రవాణా, పారిశ్రామిక రంగాల్లో అద్భుతమైన ప్రగతి కనిపించింది. పారిశ్రామిక రంగంలో 1929 గొప్ప మైలురాయి. ప్రభుత్వం రూ.కోటితో ఇండస్ట్రియల్‌ ట్రస్ట్‌ ఫండ్‌ (ఐటీఎఫ్‌)ను ఏర్పాటు చేసింది. పెద్ద పరిశ్రమలకు అప్పులు ఇచ్చి వాటిపై వచ్చే ఆదాయంతో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించింది. నిజాం రాజ్య గ్యారెంటీడ్‌ రైల్వే ఆధ్వర్యంలో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.

1932 నాటికి నిజాం రోడ్డు రవాణా సంస్థ, 1938లో దక్కన్‌ విమానయాన సంస్థ ఏర్పాటయ్యాయి. 1885లోనే టెలిఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. 1938–39లో నిజాం ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ద్వారా 20 మిలియన్‌ కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఒక మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. ఈ అభివృద్ధి అప్పట్లో హైదరాబాద్‌ను అత్యధిక సంపన్నమైన  సంస్థానంగా నిలిపింది.

►1874 జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్‌ వరకు రైల్వే లైన్‌ ప్రారంభమైంది.
►మహ్మద్‌కులీ కుతుబ్‌షా మూసీ నది ఒడ్డున దాదార్‌మహల్‌ (న్యాయ మందిరం) కట్టించారు. ఆ ప్రాంగణంలోనే  1920 ఏప్రిల్‌ 20న నిజాం హైకోర్టును ప్రారంభించారు.
►1921లో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన సిటీ కాలేజ్‌ హిందూ ముస్లిం వాస్తుకళల మేలు కలయిక.
►బ్రిటిష్‌ రాణి విక్టోరియా జ్ఞాపకార్థం 1906లో మూసీనది ఒడ్డున జజ్గీఖానా నిర్మించారు. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు ఆస్పత్రి చాలా వరకు కొట్టుకుపోయింది.1911లో ఉస్మాన్‌అలీ ఖాన్‌ దీనిని పునర్నిర్మించారు.
►మక్కా మసీదుకు ఎదురుగా, చార్మినార్‌కు ఆగ్నేయ దిశలో 1928లో నిర్మించిన యునాని ఆస్పత్రి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.
►రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం 1936లో మూసీ తీరాన నిర్మించారు. ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు భాషల్లోని అనేక గ్రంథాలు, చేతిరాత గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి.
►బెల్జియంకు చెందిన రూపశిల్పి మాన్సియర్‌ జాస్పర్‌ ఆర్ట్స్‌ కళాశాలకు రూపకల్పన చేశారు. 1939 నాటికి ఈ కళాశాల పూర్తయింది.
►1925లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement