‘ఓటుకు కోట్లు’ కేసులో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాసులు ....
⇒ నేడు విచారణకు హాజరవ్వాలని ఏసీబీ ఆదేశం
⇒ త్వరలో ఇద్దరు ముఖ్యుల అరెస్టుకు రంగం సిద్ధం
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాసులు నాయుడు(మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుమారుడు)కి ఏసీబీ సోమవారం నోటీసులు జారీ చేసింది. శ్రీనివాసులు నాయుడు ప్రస్తుతం కర్ణాటకలో ఓ బేవరేజస్ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు ఆయన కార్యాలయ ఇన్‌చార్జి విష్ణు చైతన్యకూ తాఖీదులు ఇచ్చింది. బెంగళూరు వెళ్లిన ఏసీబీ ప్రత్యేక బృందం సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు అందజేసింది. మంగళవారం ఉదయం 10.30 గంట లకు హైదరాబాద్‌లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఈయనకు బేవరేజస్‌తో పాటు పలు వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో జిమ్మీబాబు, నారా లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం విదితమే.
త్వరలో మరిన్ని సంచలనాలు!
‘ఓటుకు కోట్లు’ కేసులో త్వరలో టీడీపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలను అరెస్టు చేయవచ్చని ఏసీబీ వర్గాలు తెలిపాయి. తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు వారిద్దరినీ త్వరలోనే అరెస్టు చేసి విచారించే అవకాశం ఉంది. వీరిని అరెస్టు చేసిన తర్వాత టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరికి విచారణ కోసం నోటీసులు జారీ చేయంది. ఎవరి ఖాతా నుంచి ఎవరి ఖాతాకు డబ్బులు మళ్లించారు, ఈ నిధులను ఎమ్మెల్యేలకు ఎవరు ముట్టజెప్పారు వంటి వివరాలను ఏసీబీ బయటపెట్టబోతోంది.