దసరా సెలవులు దగ్గర పడడంతో రాష్ట్ర పర్యాటక శాఖ సరికొత్త ప్యాకేజీలను సిద్ధం చేసింది.
పర్యాటక శాఖ సరికొత్త ప్యాకేజీలు
ఆన్‌లైన్‌లో బుకింగ్ ఏపీ టూరిజం డీఎం వెంకటేశ్వరరావు
సాగర్‌నగర్ : దసరా సెలవులు దగ్గర పడడంతో రాష్ట్ర పర్యాటక శాఖ సరికొత్త ప్యాకేజీలను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, చ త్తీస్‌ఘడ్ పర్యాటకులు విశాఖ అందాలను ఆస్వాదించడానికి ఆన్‌లైన్ బుకింగ్‌లు కోసం ఎగబాకుతున్నారు. దీంతో ఏపీ టూరిజంశాఖ పర్యాటకులకు ఆకట్టుకునేందుకు కొన్ని ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. వీటి వివరాలను రాష్ట్ర టూరిజం సెంట్రల్ రిజర్వేషన్ డిప్యూటీ మేనేజర్ పి. వెంకటేశ్వరరావు వివరించారు.
అరకు ప్యాకేజీ టూర్ (రైలు కమ్ రోడ్డు)
విశాఖపట్నం నుంచి అరకు (వెళ్లేటప్పుడు రైల్‌లో..వచ్చేటప్పుడు బస్సులో) వెళ్లిరావడానికి పెద్దలకు రూ.875, పిల్లలకు రూ.700లు. విశాఖ రైల్వేస్టేషన్‌లో ఉదయం ఆరు గంటలకు ట్రైన్ ఎక్కి అరకు చేరుకుంటుంది. అక్కడ ఏపీటూరిజం బస్సులో అరకు పర్యాటక ప్రదేశాలైన పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం,అనంతగిరి హిల్స్, కాఫీతోటలు, బొర్రా గుహలను తిలకించవచ్చు. అన్నీ పర్యాటక ప్రదేశాలు ప్రవేశ రుసుం, టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం కాఫీ,స్నాక్స్,మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తారు.
వైజాగ్ నైట్ లీజర్‌కు..
సాయంత్రం ఖాళీ సమయంలో నగర పర్యాటక ప్రదేశాలను వీక్షించే పర్యాటకుల కోసం వైజాగ్ నైట్ లీజర్ ప్యాకేజీ టూర్‌ను ప్రకటించింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉంటుంది. బోట్ ఫిషింగ్ హార్బర్, సబ్‌మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, శిల్పారామం, రుషికొండ బీచ్ రిసార్ట్స్‌లో డిన్నర్. ప్రవేశ రుసుము కలుపుకుని ప్యాకేజీ ఉంటుంది. పెద్దలకు రూ. 400, పిల్లలకు రూ. 300లు. ఇతర సమాచారం కోసం డిప్యూటీ మేనేజర్ సెల్ నంబర్‌లో 98480 07022 సంప్రదించవచ్చు.
బై రోడ్డు ప్యాకేజీ
విశాఖ నుంచి దట్టమైన అడవుల మధ్యలో పాము మెలికలు తిరిగేలా ఘాట్ రోడ్డుపై బస్సులో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పర్యాటకుల కోసం బై రోడ్డుపై ఒక్కరోజు ప్యాకేజీని కేటాయించారు. పెద్దలకు రూ. 1130,పిల్లలకు రూ.900లు. ఉదయం ఏడు గంటలకు బయలు దేరి రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి విశాఖ చేరుకుంటారు. మినరల్ వాటర్, లంచ్, సాయంత్రం కాఫీ, స్నాక్స్ ఇస్తారు. అరకులో పద్మాపురం గార్డెన్స్, బొర్రా రైల్వేస్టేషన్, బొర్రా గుహలు, కటిక జలపాతం, అరకు గిరిజన మ్యూజియాన్ని సందర్శించవచ్చు. ప్రవేశం ఉచితం.
వైజాగ్ సిటీ టూర్
నగరంలోని పర్యాటక పర్యాటక ప్రదేశాలను వీక్షించేందుకు ఒక రోజు సిటీ టూర్‌ను ప్యాకేజీని ప్రకటించారు. పెద్దలకు రూ. 475, పిల్లలకు రూ. 380(3-10 వయస్సు) సెంట్రల్ రిజర్వేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలు దేరి సింహాచలం, కైలాసగిరి, తెలుగు మ్యూజియం, జాతర శిల్పారామం (మధురవాడ),తొట్లకొండ, పిషింగ్ హార్బర్, బోట్ షికార్, రుషికొండ బీచ్, రామానాయుడు స్టూడియో, విశాఖ మ్యూజియం, సబ్‌మెరైన్ మ్యూజియం,విశాఖ మ్యూజియం వంటి ప్రదేశాలు తిలకించవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు బయలు దేరి ప్రదేశంలోనే దింపుతారు. ఇదే టూర్ ఏసీ బస్సుల్లో అయితే పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.500లు శాఖహార భోజనం అందిస్తారు.