రాష్ట్రాభివృద్ధికి సముద్ర వనరులు ముఖ్యం

రాష్ట్రాభివృద్ధికి సముద్ర వనరులు ముఖ్యం - Sakshi

  •  జాతీయ సదస్సులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌

  • నెల్లూరు (టౌన్‌): రాష్ట్రాభివృద్ధికి సముద్ర వనరులు ముఖ్యమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ విజయప్రకాష్‌ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకేంద్రంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో సంప్రదాయ సముద్రనీటి వనరుల విజ్ఞానంపై శుక్రవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి విజయప్రకాష్‌ మాట్లాడుతూ సముద్ర జీవజాల పునః సమీకరణ అవసరమన్నారు. ఏపీకి ప్రకృతి సంపద, జల వనరులు మంచి ఆదాయ మార్గాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి 221 మత్స్య కేంద్రాలతో పాటు 6,23,000 గ్రామాలు ఉన్నాయన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అంతకంతకూ పెరుగుతున్న సముద్ర నీటిమట్టం మూలంగా మత్స్యకార జీవితాలపై పెనుప్రభావం పడుతుందని తెలిపారు. సముద్ర నీటిమట్టం ఒక మీటరు పెరిగినా ఏపీలో 282 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. మొత్తం 1.29 మిలియన్ల జనాభా తమ ఆవాసాలను కోల్పోతారని చెప్పారు. వీసీ వీరయ్య మాట్లాడుతూ వీఎస్‌యూ మెరైన్‌ బయాలజీ విభాగం గొప్ప పరిశోధనలకు కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. అంటార్కిటికా లాంటి మంచు ఖండంలో దొరికే అత్యంత పౌష్టికాహారమైన క్రిల్స్‌లాంటి వాటిపై పరిశోధనలు చేసేందుకు సన్నద్ధం కావాలని తెలిపారు. రిజిస్ట్రార్‌ శివశంకర్‌ మాట్లాడుతూ పరిశోధనలో ప్రాంతీయ అవసరాలకు ప్రధాన భూమిక ఇవ్వాలని కోరారు. కృష్ణపట్నం పోర్టు జిల్లాకు మంచి ఆభరణమైనా, దాని మూలంగా ఎంతో అమూల్యమైన మడ అడవులు అంతరించడంపై మెరైన్‌ బయాలజీ విభాగం దృష్టి సారించాలన్నారు. సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి విజయ మాట్లాడుతూ 2014 వరకు 187వేల టన్నులు మత్స్య ఉత్పత్తి చేయగా ప్రస్తుతం దానిని 319వేల టన్నులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రష్యాకు చెందిన సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ యూనివర్సిటీతో అవగాహన చేసుకుని రాష్ట్రంలో మూడు కొత్త మత్స్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ విజయ సంకలనం చేసిన ఫిష్‌ అండ్‌ ఫిషరీస్‌ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. 

     
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top