నాసా..శ్రావ్య | NASA invitation to poor student sravya | Sakshi
Sakshi News home page

నాసా..శ్రావ్య

Jun 16 2016 4:29 AM | Updated on Sep 4 2017 2:33 AM

నాసా..శ్రావ్య

నాసా..శ్రావ్య

‘ఆకాశంలో మెరిసేది ఏమిటి.. ఎందుకు మెరుపులొస్తాయి.. పైన ఏముంటుంది.. ఎందుకలా జరుగుతుంది’ ఇవన్నీ తల్లిదండ్రులు, తాతయ్యకు నిత్యం ఆమెవేసే ప్రశ్నలు.

పేదింటి బిడ్డకు అరుదైన అవకాశం
‘నాసా’ కేంద్రం నుంచి ఆహ్వానం
బాల మేథావికి పలువురి ప్రశంసలు
ఉచిత విద్య అందించేందుకు ముందుకొచ్చిన ‘శ్రీచైతన్య’

 ‘ఆకాశంలో మెరిసేది ఏమిటి.. ఎందుకు మెరుపులొస్తాయి.. పైన ఏముంటుంది.. ఎందుకలా జరుగుతుంది’ ఇవన్నీ తల్లిదండ్రులు, తాతయ్యకు నిత్యం ఆమె వేసే ప్రశ్నలు. చిన్నతనంలోనే ప్రతి విషయంపై తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న ఆమె అదే పట్టుదలతో ఖగోళంపై ఉన్న మరిన్ని విషయాలు తెలుసుకోగలిగింది. జాతీయ స్థాయి పరీక్షలో అత్యంత ప్రతిభ కనబరిచి నాసా(నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నుంచి ఆహ్వానం అందుకుంది ఈ పేదింటి బిడ్డ.  - ఖమ్మం

ఖమ్మం బస్టాండ్ సమీపంలో చిన్న బడ్డీకొట్టు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వేముల శ్యాం, కల్యాణి దంపతులకు సాత్విక, శ్రావ్య ఇద్దకు కూతుళ్లు. కొడుకులు లేరనే బెంగతో కూతుళ్లను చిన్నచూపు చూసే వారున్న ఈ రోజుల్లో పురుషులకు తమ కుమార్తెలు ఎక్కడ తీసిపోరనే విధంగా పెంచారు ఆ దంపతులు. ఆకాశం వైపు చూసి.. అక్కడి విషయాలు తెలుసుకోవాలనే తపనతో ఉన్న చిన్న కుమార్తె శ్రావ్యకు వచ్చిన ఆలోచనలకు పదును పెట్టాడు తండ్రి. నగరంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో 8వ తరగతిలో చేర్పించి.. కూతురు ఆలోచనలను అక్కడి ఉపాధ్యాయులకు వివరించాడు.

పాఠశాల డెరైక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య శ్రావ్య ఆలోచనలకు పదును పెట్టారు. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులతో చర్చించి.. శ్రావ్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బోధించాలని సూచించారు. ఆమెలోని పట్టుదల ఒక వైపు.. మరో వైపు పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం నుంచి ప్రోత్సాహం రావడంతో శ్రావ్య నాసా కేంద్రం గురించి అన్ని విషయాలు అధ్యయనం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఆరంజ్ ప్లానెట్ ఎడ్యుకేషన్, నాసా కెనడీ స్పేస్ వారు సంయుక్తంగా నిర్వహించిన నేషనల్ ఆస్ట్రానమీ ఒలంపియాడ్ పరీక్ష రాసి ప్రతిభ కనబరిచింది. జాతీయ స్థాయిలో రెండు దశలుగా జరిగిన పరీక్షలో అసమాన ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ద్వితీయ స్థాయిలో నిలిచింది. నాసా ఆహ్వానం అందుకున్న వారిలో దక్షిణ భారతదేశంలోనే ఏకైక విద్యార్థిగా శ్రావ్య ఉండటం జిల్లాకే గర్వకారణం.

 అవార్డులు.. అభినందనలు
ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా కేంద్రం పరిశీలన, అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి మాట్లాడే అరుదైన అవకాశం అందుకున్న శ్రావ్యకు ప్రముఖుల ప్రశంసలు, అభినందనలు, అవార్డులు దక్కించుకుంది. నేషనల్ ఆస్ట్రానమీ ఒలంపియాడ్ నిర్వాహకులు అవార్డుతో ఆమెను సత్కరించారు. నెహ్రూ ప్లానెటోరియం డెరైక్టర్ రత్నశ్రీ నుంచి అవార్డు అందుకుంది. ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు అభినందించారు. శ్రీచైతన్య కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డెరైక్టర్ శ్రీవిద్యతోపాటు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు అభినందనలు తెలిపారు. నాసా వెళ్తున్న శ్రావ్యకు శుభాకాంక్షలు తెలిపారు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామని శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం ప్రకటించింది.  

 పది రోజులు నాసాలోనే..
నాసా పరిశీలనలో భాగంగా అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి పది రోజులు ఉండే అవకాశం శ్రావ్యకు దక్కింది. గురువారం ఢిల్లీలో విమానం ఎక్కనున్న శ్రావ్యను ఈనెల 17న నాసా పరిశోధనా కేంద్రంలోకి తీసుకెళ్తారు అక్కడ ఈనెల 25వ తేదీ వరకు శాస్త్రవేత్తలతో నిర్వహించే సెమినార్లలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధనలపై పలు ప్రశ్నలను నివృత్తి చేయడం వంటి అరుదైన అవకాశం ఆమెకు కలుగుతుంది. ఎనీ హౌ.. నాసా వెళ్లిన శ్రావ్య ఆల్  ది బెస్ట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement