కదం తొక్కిన మున్సిపల్ కార్మికులు
నెల్లూరు (సెంట్రల్) : సమస్యలు పరిష్కరించమంటే కార్మికులపై దాడులు చేస్తున్న అధికార పార్టీ నాయకుల తీరుపై కార్మికులు కదం తొక్కారు.
-
సమస్యలను పరిష్కరించాలని నగరంలో ర్యాలీ
-
భారీగా పోలీసుల మొహరింపు
నెల్లూరు (సెంట్రల్) : సమస్యలు పరిష్కరించమంటే కార్మికులపై దాడులు చేస్తున్న అధికార పార్టీ నాయకుల తీరుపై కార్మికులు కదం తొక్కారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ , సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని ఆత్మకూరు బస్టాండు నుంచి వీఆర్సీ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాయా కష్టం చేసే కార్మికులపై దాడులు చేయించడం సిగ్గు చేటన్నారు. 270 జీఓను రద్దు చేయాలని కోరితే దాడులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై మేయర్ అబ్దుల్ అజీజ్ పోలీసులను ఉసిగొల్పి నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. నగరంలో శాంతియుత ర్యాలీకి అనుమతులు ఇవ్వకుండా భారీగా పోలీసులను మొహరించడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికుల హక్కులను పోలీసులతో అణచివేయలేరన్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీసు బలగాలను మొహరించి కార్మికులను అవమానపరిచారని మేయర్ తీరుపై మండి పడ్డారు. ఈ ర్యాలీకి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జెన్ని రమణయ్య మద్దతు తెలిపారు. కార్మికుల సమస్యలను ఈ నెల 8న సీఎం దృష్టికి తీసుకుపోతామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, నాయకులు గోపాల్, పెంచలయ్య, మస్తాన్‌బీ, తదితరులు పాల్గొన్నారు.