breaking news
municipal workers rally
-
మున్సిపల్ కార్మికులపై విరిగిన లాఠీ
నెల్లూరు (బారకాసు): సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. మహిళలని కూడా చూడకుండా తోసేశారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. కిందపడిపోయిన కొందరు.. లాఠీచార్జ్‌లో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందర్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 45 రోజులుగా సమ్మె చేస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారంతా గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడించేందుకు కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చేందుకు యత్నించారు. మరోవైపు మేయర్ స్రవంతి రాజీనామా ఆమోదం కోసం కౌన్సిల్ అత్యవసర సమావేశం జరుగుతోంది. తమ సమస్యలపై వినతిపత్రాన్ని అధికారులకు అందజేయాలనే ఉద్దేశంతో కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు కార్మికుల్ని అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝుళిపించడంతో కార్మికులు కిందపడిపోయారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు తాకరాని చోట తాకుతూ గందరగోళం సృష్టించారు. కార్మికులను ఇష్టానుసారం లాఠీలతో కొట్టారు. సీఐటీయూ నేతలు, కార్యకర్తలతోపాటు అనేకమంది మహిళా కార్మికులకు గాయాలయ్యాయి. రక్తగాయాలైన మహిళల్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం 63 మంది కార్మికులు, యూనియన్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లలో ఎక్కించి ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, కమిషనర్ నందన్, ఇన్చార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ వచ్చి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పగా కార్మికులు అంగీకరించలేదు. మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. చివరికి అరెస్ట్ చేసిన వారిని తీసుకొచ్చి కార్పొరేషన్ కార్యాలయం వద్ద విడిచి పెట్టడంతో నిరసనను తాత్కాలికంగా విరమించారు. -
కదం తొక్కిన మున్సిపల్ కార్మికులు
సమస్యలను పరిష్కరించాలని నగరంలో ర్యాలీ భారీగా పోలీసుల మొహరింపు నెల్లూరు (సెంట్రల్) : సమస్యలు పరిష్కరించమంటే కార్మికులపై దాడులు చేస్తున్న అధికార పార్టీ నాయకుల తీరుపై కార్మికులు కదం తొక్కారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ , సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని ఆత్మకూరు బస్టాండు నుంచి వీఆర్సీ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాయా కష్టం చేసే కార్మికులపై దాడులు చేయించడం సిగ్గు చేటన్నారు. 270 జీఓను రద్దు చేయాలని కోరితే దాడులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై మేయర్ అబ్దుల్ అజీజ్ పోలీసులను ఉసిగొల్పి నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. నగరంలో శాంతియుత ర్యాలీకి అనుమతులు ఇవ్వకుండా భారీగా పోలీసులను మొహరించడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికుల హక్కులను పోలీసులతో అణచివేయలేరన్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీసు బలగాలను మొహరించి కార్మికులను అవమానపరిచారని మేయర్ తీరుపై మండి పడ్డారు. ఈ ర్యాలీకి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జెన్ని రమణయ్య మద్దతు తెలిపారు. కార్మికుల సమస్యలను ఈ నెల 8న సీఎం దృష్టికి తీసుకుపోతామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, నాయకులు గోపాల్, పెంచలయ్య, మస్తాన్‌బీ, తదితరులు పాల్గొన్నారు.


