మేయర్‌ పీఠం లక్ష్యంగా పనిచేయాలి | Sakshi
Sakshi News home page

మేయర్‌ పీఠం లక్ష్యంగా పనిచేయాలి

Published Mon, Sep 18 2017 8:54 AM

మేయర్‌ పీఠం లక్ష్యంగా పనిచేయాలి - Sakshi

సమన్వయకర్తలకు ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపు
సీఎం మోసపూరిత హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితవు
వైఎస్సార్‌ కుటుంబం, నవరత్నాలపై సమీక్ష


సీతమ్మధార(విశాఖఉత్తర) : జీవీఎంసీకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. విశాఖ మేయర్‌ పీఠం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సీతమ్మధారలోని ఎంపీ కార్యాలయంలో జీవీఎంసీ పరిధిలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. వైఎస్సార్‌ కుటుంబం, నవరత్నాల ప«థకాలపై సమీక్షించారు. అనంతరం విడివిడిగా నియోజకవర్గాల సమన్వయకర్తలతో పలు అంశాలపై మాట్లాడారు. జీవీఎంసీ ఎన్నికలకు సన్నద్ధత, వ్యూహ ప్రతి వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పట్ల ఆదరణ, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానం పెరుగుతోందని చెప్పారు.

అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ ఎంతో బలంగా ఉందన్నారు. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తప్పడు హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. వీటన్నిటిని ఇంటింటికి వైఎస్సార్‌ కుటుంబం, నవరత్నాల పథకం గురించి వివరించడానికి వెళ్లినప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు ఎప్పడు ఎన్నికలు వస్తాయా? సీఎం చంద్రబాబుకు ఎలా బుద్ధి చెప్పాలా? అని ఎదురు చూస్తున్నారని చెప్పారు.

అందరి సమష్టి కృషితో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, అదిప్‌రాజ్, మళ్ల విజయప్రసాద్, సత్తి రామకృష్ణారెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, సనపల చంద్రమౌళి, అక్కరమాని విజయనిర్మల, వెంకట్రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి జి.రవిరెడ్డి, బీసీడీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, మొల్లి అప్పారావు, తుళ్లి చంద్రశేఖర్, విద్యార్థి విభాగం నాయకుడు కాంతారావు, రెయ్యి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement