
అభివృద్ధికి ప్రాధాన్యం
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
సాక్షి, జగిత్యాల: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి జిల్లాను ప్రగతిపథంలో నడిపించాలని కోరారు. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఖిలాలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా జిల్లావాసులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కొప్పుల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన కేసీఆర్‌యే సీఎం కావడం ప్రజలందరి అదృష్టమన్నారు. ప్రజలకు ఏంఏం కావాలో గుర్తించి సమకూరుస్తున్నారని.. ఇందులో భాగంగా అనేక ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఒంటరి మహిళలకు రూ. వెయ్యి జీవనభృతి పథకానికి ఈ నెల 4న శ్రీకారం చుట్టనున్నామని ఈ క్రమంలో జిల్లాలో 3,757 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే.. మాతాశిశు సంరక్షణకు సంబంధించి మూడో తేదీన గర్భిణులకు మూడు విడతలుగా రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే మరో రూ. వెయ్యి అందించడం జరుగుతుందన్నారు. ప్రవాసనాంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు.
కులవృత్తులను ప్రోత్సహించేలా గొర్రెల పెంపకం దార్లకు సబ్సిడీ గొర్రెల పథకానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు. జిల్లాలో 21,048 దరఖాస్తులు చేసుకోగా లాటరీ పద్ధతి ద్వారా 10,552 మందిని ఎంపిక చేశామని, వచ్చే సంవత్సరం మిగతా వారిని ఎంపిక చేస్తామన్నారు. మత్య్సకారుల సంక్షేమాభివృద్ధి కోసం చేపల అభివృద్ధి కింద 100 శాతం సబ్సిడీపై 168 చెరువుల్లో 49,23,400 చేప పిల్లలను వదిలామని చెప్పారు. గ్రామాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ మొదటి విడత కింద రూ.29.39 కోట్లతో 195 చెరువు, రెండో విడతలో రూ.76.98 కోట్లతో 97 చెరువుల పనులు పూర్తి చేశామన్నారు. మూడో విడతలో 162 చెరువులు రూ.32.11 కోట్ల అంచనాలతో మంజూరు పొందగా టెండర్ల ప్రక్రియ చేపట్టి 141 చెరువులు పురోగతిలో ఉన్నాయన్నారు. హరితాహారం పథకంలో భాగంగా 2015–16 సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర స్థలాల్లో 109 లక్షల మొక్కలు నాటామన్నారు.
2017 సంవత్సరానికి గాను 132 లక్షలు నర్సరీలో పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లానీరు అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.1430 కోట్లతో పనులు చేపట్టి 18 మండలాల్లోని 482 ఆవాసాల్లోని 9.82 లక్షల జనాభాకు మంచినీరు సరఫరాకు పనులు జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్ గ్రామ పరిధిలో ఎస్సారెస్పీ చేపట్టిన ఇంటెక్‌వెల్ నుంచి ఇబ్రహీంపట్నం మండలం డబ్బ గ్రామం వద్ద 145 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మాణం అవుతున్న నీటిశుద్ధి కేంద్రం ద్వారా మంచినీటి సరఫరా పనులు 90 శాతంపూర్తయ్యాయన్నారు. ఇప్పటి వరకు 320.64కోట్లు ఖర్చు చేశామన్నారు.
పేద ప్రజల సొంతింటి కల సాకారం చేసేలా గత ఆర్ధిక సంవత్సరంలో 1400 డబుల్ బెడ్‌రూంలు మంజూరు కాగా 900 ప్రగతిలో ఉన్నాయన్నారు. మిగతా 500 టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. స్థలాల ఎంపిక జరుగుతుందన్నారు. జగిత్యాల పట్టణానికి అదనంగా 4 వేల ఇళ్లు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సాదాబైనామా దరఖాస్తులు 32,767 వచ్చాయని, వాటిలో నేటి వరకు 24,185 దరఖాస్తులు ఆమోదించి 23,255 దరఖాస్తు ఫాంలు 13బీ జనరేట్ చేసి 22,377 దరఖాస్తులు అప్‌లోడ్ చేశామన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన జమీన్‌బందీ కార్యక్రమానికి 167 దరఖాస్తులు రాగా పరిశీలనలో ఉన్నాయన్నారు.
గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పంచాయతీరాజ్ శాఖచే రూ. 53.4 కోట్లతో 763 పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు 414 పనులు పూర్తయ్యాయన్నారు. టీఎస్ ఐ–పాస్ కింద జిల్లాలో రూ. 474 కోట్ల పెట్టుబడితో 92 కంపెనీలకు అనుమతులిచ్చామన్నారు. జిల్లాలోగుడుంబా వ్యాపారం మానేసిన వారికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి 159 మందిని గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేశామన్నారు. కులాంతర వివాహ ప్రోత్సహక బహుమతి కింద ప్రభుత్వపరంగా ఒక జంటకు రూ.50 వేలు అందజేస్తున్నట్లు వివరించారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బీసీ వర్గాల వారి కోసం ఆర్థికంగా ఆదుకోవాలని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మైనార్టీ సంక్షేమంలో భాగంగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడు కొత్త మైనార్టీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో 29,900 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 22 గోదాంలు ఏర్పాటు చేశామన్నారు. నాబార్డ్ కింద 47,500 మెట్రిక్ టన్నుల 10 గోదాంలు, రూ.28.50 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాన్ని తమ పొలంలోనే ఉత్పత్తికి ప్రొత్సహించేందుకు జిల్లాలో వినూత్నంగా మన ధాన్యం మన విత్తనం కార్యక్రమం చేపట్టామన్నారు. 275 మంది రైతులు 276 ఎకరాల్లో 6875 విత్తనాలు సిద్ధం చేశారన్నారు. జిల్లాలో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు 1,97,880 ఉన్నాయన్నారు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో 7826 శ్రమశక్తి సంఘాలకు 1,61,563 జాబ్‌కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు.
2016–17 ఆర్థిక సంవత్సరంలో 63,458 కుటుంబాలకు రూ.55.10 కోట్లతో 22 లక్షల 48 వేల పని దినాలు కల్పించామన్నారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ఉత్తమ అవార్డులతో పాటు రూ. 51 వెయ్యి నగదు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్, జిల్లా జడ్జి రంజన్‌కుమార్, మొదటి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మధు మున్సిపల్ చైర్‌పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.