అంతులేని జాప్యం | late process in anganwadies | Sakshi
Sakshi News home page

అంతులేని జాప్యం

Dec 31 2016 10:50 PM | Updated on Jun 2 2018 8:32 PM

అంతులేని జాప్యం - Sakshi

అంతులేని జాప్యం

ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి, విద్యాబుద్ధులు నేర్పేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిశు సంరక్షణ పథకం కింద ప్రతి పల్లెలోనూ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొన్నింటికి సొంత భవనాలు ఉన్నాయి.

- అంగన్‌వాడీలకు మంజూరుకాని అద్దె బకాయిలు
–18 నెలలుగా బకాయిలు చెల్లించని ప్రభుత్వం
– 3 నెలలుగా అందని వేతనాలు


జిల్లా : అనంతపురం
ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లు : 17
అంగన్‌వాడీ మెయిన్‌ సెంటర్లు : 4,082
మినీ సెంటర్లు : 763
అంగన్‌వాడీ కార్యకర్తలు : 4,082
హెల్పర్లు : 3,699
గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ సెంటర్‌కు ఇచ్చే అద్దె : రూ.750
పట్టణ ప్రాంతాల్లో చెల్లించే అద్దె : రూ.3,000


ధర్మవరం : ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి, విద్యాబుద్ధులు నేర్పేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిశు సంరక్షణ పథకం కింద ప్రతి పల్లెలోనూ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొన్నింటికి సొంత భవనాలు ఉన్నాయి. సొంత భవనాలు లేని కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అద్దె చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు.

    జిల్లాలో ఉన్న మొత్తం 17 ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 4,845 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 70శాతం అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అద్దె భవనాల్లో నడిచే అంగన్‌వాడీ కేంద్రాలకు పట్టణాల్లో అయితే రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నడిచే వాటికి రూ.750 చొప్పున అద్దెలు చెల్లిస్తున్నారు. అయితే ఈ అద్దెలను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 17 ప్రాజెక్ట్‌ల పరిధిలో  సగానికిపైగా సెంటర్లకు 18 నెలలుకు సంబంధించిన అద్దెలు చెల్లించాల్సి ఉంది. మరికొన్నింటికి 6 నెలలు, ఏడాదికాలంగా అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానుల ఒత్తిళ్లు భరించలేక చాలా మంది అంగన్‌వాడీ కార్యకర్తలు అప్పులు తెచ్చి చెల్లిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎప్పుడో ఒకరోజు వస్తుందులే అనుకుంటారు..అదే పట్టణ ప్రాంతాల్లో నెలల తరబడి అద్దెలు చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లో ఖాళీ చేసి వెళ్తే   అదే మొత్తానికి, సంబంధిత వార్డులోనే ఇళ్లు దొరకడం కష్టం. అందుకోసం అప్పులు చేసి అద్దెలు చెల్లిస్తున్నామని వారు చెప్తున్నారు.

అదనపు భారం  :
    అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల సంఖ్య, పథకాల అమలుకు సంబంధించిన వివరాలను ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంది. ఈ పని చేసేందుకు సూపర్‌వైజర్లకు ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసినా ఆ భారం అంగన్‌వాడీ కార​‍్యకర్తలపైనే వేస్తున్నారు. దీంతో వారు నెట్‌ సెంటర్లకు వెళ్లి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయించాల్సి వస్తోంది.    ఒక్కో పేపరుకు రూ.10 చొప్పున ఆయా సెంటర్లలో ఆన్‌లైన్‌లో నమోదు  చేయించాల్సి ఉంది. ఇందుకు అంగన్‌వాడీలే సొంతంగా ఖర్చు పెడుతున్నారు. ఇవి కాక ప్రభుత్వ కార్యక్రమాలు సరేసరి..

 మూడు నెలలుగా అందని వేతనాలు :
    క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తూ... ప్రతి చిన్న పనీ ప్రభుత్వానికి చేసిపెడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే  అంగన్‌వాడీలకు గత మూడు నెలలుగా వేతనాలు మంజూరు చేయలేదు. ఇటువేతనాలు అందక, అటు సెంటర్లకు అద్దెలు మంజూరుకాక అవస్థలు పడుతున్నారు.  దీనికి తోడు ఆరు నెలలకు సంబంధించిన గ్యాస్‌ బకాయిలను, మరో ఆరు నెలలకు సంబంధించిన టీఏ బిల్లులను ప్రభుత్వం అంగన్‌వాడీకు బకాయి పడింది.  ప్రస్తుత పరిస్థితుల్లో కష్టాలు మరింత అధికమయ్యాయి.

ప్రతిపాదనలు పంపాం
    జిల్లాలో కొన్ని అంగన్‌వాడీ సెంటర్లకు 18 నెలలుగా అద్దెలు బకాయిపడిన మాట వాస్తవమే..జిల్లాలోని అన్ని  అంగన్‌వాడీ సెంటర్లకు సంబంధించిన బాకాయిలు చెల్లించాలని డైరెక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపాం.. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే వేతనాలు, అద్దె బకాయిలను చెల్లిస్తాం.
– జుబేదాబేగం, ఐసీడీఎస్‌ పీడీ, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement