breaking news
jubeda begum
-
నటుడు అలీ దంపతులకు సన్మానం
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు అలీ అద్భుతమైన కళాకారుడని, విలువలుగ వ్యక్కి అని ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం కితాబిచ్చారు. ఎస్ఆర్ఆర్ ఫార్చూన్ ఇన్ఫ్రా సౌజన్యంతో పద్మ మోహన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో అలీ, జుబేదా దంపతులకు ‘పద్మ మోహన స్వర్ణ కంకణం, విశిష్ట దంపతులు, జీవిత సాఫల్య పురస్కారాన్ని’ గురువారం రవీంద్రభారతిలో ప్రధానం చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. సామాన్యంగా కొన్ని వంద సినిమాలు చూడడమే కష్టమని.. అలాంటిది కొన్ని వందల సినిమాల్లో నటించడం అలీకే చెల్లిందన్నారు. అలీ మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పలు భాషలలో 11 వందల సినిమాలలో నటించాను. త్వరలో దబాంగ్–3, హాలీవుడ్ చిత్రం గోల్డెన్ బర్డ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి’ అని పేర్కొన్నారు. కాగా వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులకు ఇదే వేదికపై పద్మ మోహన అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
అంతులేని జాప్యం
- అంగన్వాడీలకు మంజూరుకాని అద్దె బకాయిలు –18 నెలలుగా బకాయిలు చెల్లించని ప్రభుత్వం – 3 నెలలుగా అందని వేతనాలు జిల్లా : అనంతపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు : 17 అంగన్వాడీ మెయిన్ సెంటర్లు : 4,082 మినీ సెంటర్లు : 763 అంగన్వాడీ కార్యకర్తలు : 4,082 హెల్పర్లు : 3,699 గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్‌కు ఇచ్చే అద్దె : రూ.750 పట్టణ ప్రాంతాల్లో చెల్లించే అద్దె : రూ.3,000 ధర్మవరం : ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి, విద్యాబుద్ధులు నేర్పేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిశు సంరక్షణ పథకం కింద ప్రతి పల్లెలోనూ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొన్నింటికి సొంత భవనాలు ఉన్నాయి. సొంత భవనాలు లేని కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అద్దె చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో అంగన్వాడీ కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 17 ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 4,845 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 70శాతం అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అద్దె భవనాల్లో నడిచే అంగన్వాడీ కేంద్రాలకు పట్టణాల్లో అయితే రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నడిచే వాటికి రూ.750 చొప్పున అద్దెలు చెల్లిస్తున్నారు. అయితే ఈ అద్దెలను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 17 ప్రాజెక్ట్‌ల పరిధిలో సగానికిపైగా సెంటర్లకు 18 నెలలుకు సంబంధించిన అద్దెలు చెల్లించాల్సి ఉంది. మరికొన్నింటికి 6 నెలలు, ఏడాదికాలంగా అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానుల ఒత్తిళ్లు భరించలేక చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు అప్పులు తెచ్చి చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎప్పుడో ఒకరోజు వస్తుందులే అనుకుంటారు..అదే పట్టణ ప్రాంతాల్లో నెలల తరబడి అద్దెలు చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లో ఖాళీ చేసి వెళ్తే అదే మొత్తానికి, సంబంధిత వార్డులోనే ఇళ్లు దొరకడం కష్టం. అందుకోసం అప్పులు చేసి అద్దెలు చెల్లిస్తున్నామని వారు చెప్తున్నారు. అదనపు భారం : అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల సంఖ్య, పథకాల అమలుకు సంబంధించిన వివరాలను ఏరోజుకారోజు ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంది. ఈ పని చేసేందుకు సూపర్వైజర్లకు ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసినా ఆ భారం అంగన్వాడీ కార్యకర్తలపైనే వేస్తున్నారు. దీంతో వారు నెట్ సెంటర్లకు వెళ్లి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయించాల్సి వస్తోంది. ఒక్కో పేపరుకు రూ.10 చొప్పున ఆయా సెంటర్లలో ఆన్లైన్లో నమోదు చేయించాల్సి ఉంది. ఇందుకు అంగన్వాడీలే సొంతంగా ఖర్చు పెడుతున్నారు. ఇవి కాక ప్రభుత్వ కార్యక్రమాలు సరేసరి.. మూడు నెలలుగా అందని వేతనాలు : క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తూ... ప్రతి చిన్న పనీ ప్రభుత్వానికి చేసిపెడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే అంగన్వాడీలకు గత మూడు నెలలుగా వేతనాలు మంజూరు చేయలేదు. ఇటువేతనాలు అందక, అటు సెంటర్లకు అద్దెలు మంజూరుకాక అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఆరు నెలలకు సంబంధించిన గ్యాస్ బకాయిలను, మరో ఆరు నెలలకు సంబంధించిన టీఏ బిల్లులను ప్రభుత్వం అంగన్వాడీకు బకాయి పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో కష్టాలు మరింత అధికమయ్యాయి. ప్రతిపాదనలు పంపాం జిల్లాలో కొన్ని అంగన్వాడీ సెంటర్లకు 18 నెలలుగా అద్దెలు బకాయిపడిన మాట వాస్తవమే..జిల్లాలోని అన్ని అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన బాకాయిలు చెల్లించాలని డైరెక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపాం.. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే వేతనాలు, అద్దె బకాయిలను చెల్లిస్తాం. – జుబేదాబేగం, ఐసీడీఎస్ పీడీ, అనంతపురం