ఐవైఆర్ కృష్ణారావును చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా తప్పించిందని వైఎస్సార్‌సీపీ విమర్శించింది.
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): ప్రభుత్వానికి 30 సంవత్సరాల పాటు సేవలందించిన ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా తప్పించిందని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. కాకినాడలో ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలపై ఐవైఆర్ చేసిన సవాల్‌కు ఇంతవరకు టీడీపీ నేతలు సమాధానం చెప్పలేదని తెలిపారు.
కార్పొరేషన్లో 14 పథకాలున్నాయి కానీ వాటిని అమలు చేసేందుకు డబ్బులు లేవని, మూడున్నర ఏళ్లుగా రూ. 135 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం కేవలం రూ.90 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. అర్చకులకు రూ.5వేలు జీతం ఇచ్చేందుకు 18,500 దేవాలయాలను 3,300కి కుదించారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు తగిన గుర్తింపు ఇస్తుందని హామీయిచ్చారు.