జలపాతం అందాలను ఆస్వాదించటానికి వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు.
వాజేడు (ఖమ్మం) : జలపాతం అందాలను ఆస్వాదించటానికి వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచ నవభారత్ కాలనీకి చెందిన దరావత్ పవన్ (18) కొత్తగూడెంలోని నలంద కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తన మిత్రులతో కలసి బొగత జలపాతం వద్దకు వచ్చాడు.
జలపాతంలోని లక్ష్మీనరసింహా స్వామి ఆలయ సమీపం వద్ద ఉన్న రాళ్లపై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు పవన్ జారి జలపాతంలో పడ్డాడు. వెంటనే నీటిలో మునిగిపోవడంతో పర్యాటకులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సుమారు గంట తర్వాత పవన్ మృతదేహాన్ని బయటకు తీశారు.


