‘మధ్యాహ్నం’లో కక్కుర్తి! | illegal contactors in Afternoon scheme | Sakshi
Sakshi News home page

‘మధ్యాహ్నం’లో కక్కుర్తి!

Feb 20 2016 1:40 AM | Updated on Mar 28 2019 6:18 PM

‘మధ్యాహ్నం’లో కక్కుర్తి! - Sakshi

‘మధ్యాహ్నం’లో కక్కుర్తి!

పిల్లలకు పెట్టే అన్నంలోనూ అక్రమార్కులు కక్కుర్తిపడుతున్నారు. వారి నోటికాడి బువ్వనూ లాక్కుంటున్నారు.

బియ్యం బస్తాల తూకంలో అక్రమాలు
‘మధ్యాహ్న’ పథకం బియ్యం సరఫరాలో చేతివాటం
తక్కువ తూకంతో బడులకు చేరుతున్న కోటా
అర క్వింటాలు బ్యాగులో 45 నుంచి 47 కిలోలే..
ఇతర దుకాణాల్లో తూకమేయగా వెలుగులోకి..
ఏటా 493 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి

 
  పిల్లలకు పెట్టే అన్నంలోనూ అక్రమార్కులు కక్కుర్తిపడుతున్నారు. వారి నోటికాడి బువ్వనూ లాక్కుంటున్నారు. చదువుపై ఆసక్తి పెంచడంతోపాటు పౌష్టికాహార పంపిణీ కింద తలపెట్టిన మధ్యాహ్న భోజన పథకం అమలులో మరో మోసం వెలుగుచూసింది. పథకం అమలులో భాగంగా పాఠశాలలకు సరఫరా అవుతున్న బియ్యం బస్తాల తూకంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. ప్రతి బస్తా తూకంలో నాలుగు నుంచి ఐదు కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్టు బయటపడుతోంది.  జిల్లాలో ఏటా 493 మెట్రిక్ టన్నుల బియ్యం ఈ విధంగా పక్కదారి పడుతున్నట్టు సమాచారం. నిర్ధేశిత కోటా ప్రకారం ఒక పాఠశాలలో నెలరోజులపాటు సరిపోవాల్సిన బియ్యం.. రెండ్రోజుల ముందే నిండుకుంటున్నాయి. ఈ క్రమంలో కొందరు టీచర్లు బడికి వచ్చే కోటాను బయట మార్కెట్లో తూకం వేస్తే ఈ వాస్తవం వెలుగుచూసింది.  
 - సాక్షి, రంగారెడ్డి జిల్లా

 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  జిల్లాలో 2,369 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,594 ప్రాథమిక పాఠశాలలు, 250 ప్రాథమికోన్నత పాఠశాలలు, 525 ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఎయిడెడ్ పాఠశాలలున్నా యి. వీటిలో 3.75 లక్షల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం కింద వీరికి ఏటా 8,220 మెట్రిక్ టన్ను ల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. పాఠశాలల పనిదినాల్లో విద్యార్థులందరికీ ఈ కోటాతో మధ్యాహ్న భోజనాన్ని అందించవచ్చు. అయితే నిర్ధేశించిన కోటాకంటే తక్కువ మొత్తంలో బియ్యం అందడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు.

 సీల్డ్ బ్యాగే కదా అని అనుకుంటే..
 ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం పౌరసరఫరాల సంస్థ గోదాముల నుంచే అందుతుంది. అక్కడ తూకం వేసిన తర్వాత నిర్ధేశించిన కోటా మేరకు మండల కేంద్రాలకు చేర్చితే.. అ తర్వాత పాఠశాలలకు ఆ కోటా వెళ్తుంది. అయితే బడికి అందాల్సిన మేరకు సీల్డ్ బ్యాగులు వచ్చినప్పటికీ.. వాటిని తూకం వేస్తే మాత్రం తక్కువ మొత్తంలో బియ్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పిల్లలకు అరకొరగా భోజనాన్ని వడ్డించాల్సి వస్తోంది.

 ఇటీవల హయత్‌నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్ధేశిత కోటా మేరకు బియ్యం వచ్చినప్పటికీ.. వాటిని సమీపంలో ఉన్న దుకాణంలో తూకంవేస్తే సగటున బ్యాగుకు 4- 5 కిలోల మేర తక్కువ వచ్చినట్టు బయటపడింది. ఇదేతరహాలో అన్ని పాఠశాలల్లో బియ్యం తక్కువున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. జెడ్పీహెచ్‌ఎస్ ఉప్పల్, జెడ్పీహెచ్‌ఎస్ రాగన్నగూడ, జెడ్పీహెచ్‌ఎస్ ఇంజాపూర్, సోమన్‌గుర్తి, పరిగి బాలుర ఉన్నత పాఠశాలల్లో ఇదేతరహాలో బియ్యం తూకంలో తేడాలు వచ్చినట్టు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గతవారం ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఏకంగా కలెక్టర్ రఘునందన్‌రావుకు బియ్యం తూకంలో తేడాలున్నట్లు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement