ప్రత్యేక ప్యాకేజీలో మీ వాటా ఎంత
ప్రత్యేక ప్యాకేజీని సమర్థించిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అందులో ఆయన వాటా ఎంతో ప్రజలకు చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య ప్రశ్నించారు.
– డిప్యూటీ సీఎంకి వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య ప్రశ్న
కర్నూలు(టౌన్): ప్రత్యేక ప్యాకేజీని సమర్థించిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అందులో ఆయన వాటా ఎంతో ప్రజలకు చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య ప్రశ్నించారు. బుధవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హోదా విషయంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందన్నారు. అసెంబ్లీలో పది నిముషాలు మాట్లాడని వారు ప్రజల పక్షాన పోరాడుతున్న తమ నాయకుడు వైఎస్ జగన్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. అడ్డగోలుగా 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టీడీపీ నాయకులు ప్రతిపక్ష నేతను అరాచక వాదిగా పేర్కొనడం విడ్డూరమన్నారు. జిల్లాలో పరిశ్రమలకు 30వేల ఎకరాలు కేటాయించామని చెబుతున్న టీడీపీ నేతలు ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చూపాలన్నారు. మూడేళ్లు అవుతున్నా కనీసం పునాది రాళ్లకూ దిక్కులేదన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎవరి ప్రయోజనాలకోసమని ప్రశ్నించారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ విషయంలో 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపడం ఇక్కడి ప్రజలను మోసగించడమేనన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్థన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘు పాల్గొన్నారు.