కలలున్నాయి కన్నీళ్లూ ఉన్నాయి

కలలున్నాయి కన్నీళ్లూ ఉన్నాయి


తల్లిదండ్రులు చేరదీయకపోయినా.. చుట్టుపక్కల వారు దరిచేరనివ్వకపోయినా.. సమాజం దూరం పెట్టినా ఆ ‘మగవ’లు తెగువతో బతుకుతుంటారు. ‘అర్ధనారీ’మణులుగా అవస్థలు పడుతూ.. అర్థం చేసుకుని ఆదరించే వారిని చల్లగా ఉండమని దిష్టి తీస్తుంటారు. చీదరింపులు ఎదురైనా తమ స్వప్న లోకంలో బతుకుతూ కష్టాలకు ఎదురీదుతుంటారు. తాము కలలగన్న ప్రపంచం కోసం కన్నీళ్లను దిగమింగే హిజ్రాల జీవితాల్ని ఓసారి పరికిస్తే..పాలకొల్లు అర్బన్‌ : ప్రాణం లేని ఓ శరీరం ఆరుబయట ఉంటుంది. ఓ దుర్మార్గానికి ఆ శరీరం బలైపోయింది. చుట్టూ ప్రాణం ఉన్న మానవ శరీరాలు ఏడుస్తూ ఉంటాయి. దేవుడా.. ఏమిటీ బతుకు.. ఛీ పాడు జన్మ ... మళ్లీ ఇలాంటి జన్మలో మమ్మల్ని పుట్టించకు అంటూ కన్నీళ్లు పెడుతూ.. ప్రాణం లేని శరీరాన్ని చెప్పుతో కొట్టడంతో ప్రేక్షకుల నుంచి చప్పట్లు మారుమోగిపోగాయి. ఇది థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ హైదరాబాద్‌ యువకులు ప్రదర్శించిన ‘శాపగ్రస్తులు’ నాటకంలో ఓ సన్నివేశం. హిజ్రాలను కూడా మనుషులుగా చూడండి. హార్మోన్ల ప్రభావంతో జన్మించిన వాళ్లను మానవతా ధృక్పథంతో ఆదరించాలే తప్ప సమాజంలో వాళ్లను చిన్నచూపు చూడకూడదు.  వాళ్ల మీద అత్యాచారాలు, అరాచకాలు చేయకూడదు. వారిని కూడా సమాజంలో స్త్రీ, పురుషులతో సమానంగా చూడండి. మనుషులుగా గుర్తించండి అనే ఇతివృత్తంతో ప్రదర్శించిన ఆ నాటకం 2007లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును అందుకుంది.అది నాటకం.. కానీ హిజ్రాల జీవితాలను తెరచి చూస్తే వినోదం కన్నా విషాదం వారి బతుకులో ఎక్కువ.  వాళ్లూ మనుషులే.. మనలాగే వారు పుట్టారు అని ఆలోచించేవారు బహు తక్కువ. హార్మోన్ల అసమతుల్యత వల్ల అర్ధనారులుగా పుట్టి సమాజంలో చిన్నచూపునకు లోనవుతున్నవారు. వారు కూడా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చినవారే. అమ్మానాన్న, అన్నాతమ్ముళ్లు, అక్కా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలతో పెరిగినవారే. వయసు పెరిగే కొద్దీ ఆడవారి లక్షణాలు శరీరంలో వృద్ధి చెందడం.. ఆడవారిలా అలంకరించుకోవడం.. చీర కట్టుకోవడం.. జడ వేసుకోవడం.. తలలో పువ్వులు పెట్టుకోవడం వంటి లక్షణాలు వారిలో పుట్టే సహజ లక్షణాలు.ప్రత్యేక కుటుంబం వీరిది

హిజ్రాగా మారిన వ్యక్తికి ప్రత్యేక కుటుంబం ఏర్పాటవుతుంది. అప్పటికే హిజ్రాగా మారిన వ్యక్తులు ఆసరాగా నిలుస్తారు. అత్త, అమ్మ, అక్క, చెల్లి వరుసలతో వీరి కుటుంబం ఏర్పాటవుతుంది. హిజ్రాలు ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ఖననం చేయడం వీరి ఆచారం. హిజ్రాగా మారిన వ్యక్తిని హిందూ శ్మశాన వాటికలో ఖననం చేస్తారు. అత్త చనిపోతే కోడలు ముండమోస్తుంది. బొట్టు తీయడం, గాజులు పగులగొట్టడం, తెల్లచీర కట్టుకోవడం వంటి ఆచారాలను కోడలు చేస్తుంది. 41వ రోజు ఛాలిష్మా (దినం) చేస్తారు. హిజ్రాగా మారినప్పుడు ఏవిధంగా పూజలు చేస్తారో అదే విధంగా చనిపోయినప్పుడు కూడా 41వ రోజున ఛాలిష్మా నిర్వహించడం వీరి ఆనవాయితీ. అన్నట్టు వీరికి ఒక సంఘం ఉంది. ప్రతినెలా సంఘ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో సంఘం దృష్టికి వచ్చిన సమస్యలు చర్చించి జరిమానా విధిస్తారు.  భిక్షాటనే ప్రధాన వృత్తి

రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లు, షాపుల వద్ద వీరు భిక్షాటన చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అడపాదడపా ఉత్సవాలు, ఊరేగింపులు, జాతర మహోత్సవాల్లో వీరు ప్రత్యేక నృత్య ప్రదర్శనలిస్తూ ఉపాధి పొందుతున్నారు.41 రోజుల దీక్ష

హిజ్రాగా మారిన వ్యక్తి 41 రోజులు దీక్ష చేస్తారు. కేవలం చపాతి, డికాషన్‌ ఆహారంగా ఇస్తారు. 11వ రోజు, 21వ రోజు, 31వ రోజు ప్రత్యేకంగా స్నానాలు చేయిస్తారు. 40వ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఆటాపాట చేపడతారు. తెల్లవారుజామున 3 గంటలకు స్నానాల రేవుకు తీసుకువెళ్లి అక్కడ స్నానం చేయించి 41వ రోజు జల్సా చేస్తారు. వారి వారి స్తోమతను బట్టి చుట్టుపక్కల ఉన్న హిజ్రాలను పిలుచుకుని భోజనాలు పెడతారు. వచ్చిన హిజ్రాలు కానుకల రూపంలో సొమ్ములు చదివించే ఆనవాయితీ వీరిలో కూడా ఉంది.  దసరాలో దీక్ష

దసరా 9 రోజులు కనకదుర్గమ్మ దీక్ష చేపడతారు. ఎర్రని చీర ధరించి, నెత్తిమీద కుండ.. అందులో వేపాకులు వేస్తారు. మెడలో నిమ్మకాయల దండతో ధరించి భిక్షాటన చేస్తారు. కుండలో వచ్చిన డబ్బుల్లో సగం పేదల భోజనాల కోసం ఖర్చుచేస్తారు. మిగిలిన సొమ్మును హిజ్రాలంతా పంచుకుంటారు.ఉపవాసం

వారంలో రెండు రోజులు మంగళ, శుక్రవారాలు ఉపవాసాలు చేస్తారు. ఆ రోజు అన్నం తినరు. కేవలం టిఫిన్‌తో కాలక్షేపం చేస్తారు. అలాగే కొంతమంది వారంలో మూడు రోజు ఉపవాసాలు ఉంటారు.  జిల్లా నలుమూలలా..

జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో హిజ్రాలు ఉన్నారు. వీరికి ఎన్నికల సంఘం ఇతరుల విభాగంలో ఓటు హక్కు కల్పించింది. అత్యధికంగా భీమవరం పట్టణంలో 103 మంది, ఆచంటలో ఒకరు ఓటర్లుగా నమోదయ్యారు. ఏలూరు, చింతలపూడిలోనూ చెప్పుకోదగిన సంఖ్యలోనే హిజ్రాలు ఉన్నారు.బట్టల వ్యాపారం చేసుకుంటున్నా

నా వయస్సు 55. మాది భీమవరం దగ్గరలోని పల్లెటూరు. 8వ తరగతి చదువుతుండగా కుటుంబాన్ని  వదిలి వచ్చేశా. అమ్మానాన్న కాలం చేశారు. బంధువులు వదిలేశారు. ఇంటి స్థలం. అర ఎకరం కుటుంబ సభ్యులకు వదిలేశా. ఇప్పటికి సుమారు 40 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నా. ఆరగురు కూతుళ్లను చేరదీశా. వీరిలో ముగ్గురు చనిపోయారు. ముగ్గురున్నారు. ఒకరు ఆగ్రా, మరొకరు పంజాబ్, ఇంకొకరు దిల్‌బార్‌లో ఉన్నారు. ప్రస్తుతం బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నా. ప్రత్యేకంగా ఆటో కట్టించుకుని బట్టలు ఇంటింటికీ తిరిగి విక్రయించుకుని వచ్చే లాభంతో బతుకుతున్నా. ప్రభుత్వం ఏదైనా రుణం ఇప్పిస్తే బట్టల వ్యాపారం అభివృద్ధి చేసుకుంటా.

 – కుమారి, పాలకొల్లుభిక్షాటన చేస్తున్నా..

మాది నంద్యాల. నా పేరు వినోద్‌కుమార్‌ గౌడ్‌. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఇంటి నుంచి బయటకు వచ్చేశా. హిజ్రాగా మారిన తరువాత నా కుటుంబ సభ్యులు నన్ను ఇంటికి రానిచ్చేవారు కాదు. ప్రస్తుతం బాగానే చూసుకుంటున్నారు. రైళ్లలో భిక్షాటన చేసుకుని ఉపాధి పొందుతున్నా. ఉత్సవాలకు డాన్స్‌ చేస్తా. నైట్‌ డాన్స్‌ చేస్తే రూ.2 వేలు నుంచి రూ.3 వేల వరకు వస్తుంది. నేను సంపాదించిన దాంట్లోంచి కొంత సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నా. నంద్యాలలోనే అనాథలు, వృద్ధులు, వికలాంగుల సంస్థలు ఉన్నాయి. అక్కడకు పోయి వారికి భోజనాలు, బట్టలకు డబ్బులిస్తుంటా.

– వినీత, హిజ్రాదిష్టి తీస్తే శుభం

ఇంటికి, వ్యవసాయ భూమికి, షాపులకు హిజ్రాలతో దిష్టి తీయిస్తే మంచిదనే నమ్మకం ఉంది. ఇంటికి పట్టిన శని దోషం పోతుందని.. వ్యవసాయ భూమిలో పంటలు బాగా పండుతాయని.. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుందని నమ్ముతారు. అందుకే హిజ్రాలు షాపుల్లోకి వస్తే పదో, ఇరవయ్యో ఇచ్చి పంపిస్తుంటారు.అసభ్యంగా మాట్లాడతారు

నలభై ఏళ్ల నుంచి ఎన్నో అవమానాలు పడుతున్నా. ఆటో ఎక్కితే మా పక్కన ఆడవాళ్లు కూర్చోరు. మగవాళ్లు అసభ్యంగా మాట్లాడతారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రత్యేకంగా ఆటో కట్టించుకుని వెళతాం. ప్రభుత్వం మాలాంటి వారికోసం ప్రత్యేక రాయితీలు కల్పించాలి.

– రామతులసిæ, భీమవరంరూ.2 లక్షలతో వేషం మారిపోతుంది

ఇలాంటి లక్షణాలతో పుట్టిన వారు యుక్త వయసు రాగానే కుటుంబానికి దూరమైపోతున్నారు. సమాజంలో ఒక ప్రత్యేక జాతిగా పిలవబడుతున్నారు. దీనికోసం ముంబయ్, ఢిల్లీ, పూణే వంటి మహానగరాలకు వలస పోతున్నారు. అక్కడ సుమారు రూ.2 లక్షల ఖర్చుతో మగ శరీరాన్ని చంపేసుకుంటున్నారు. ఆడవారిలా మారేందుకు కొన్ని ఇంజెక్షన్‌లు చేయించుకుంటున్నారు. శరీరంలోని హార్మోన్లను వృద్ధి చేసుకుని కొత్త అవతారంతో సమాజంలోకి మూడో మనిషిగా అవతారం ఎత్తుతున్నారు.కుటుంబ భారం నాపైనే..

మాది భీమవరం పట్టణానికి చేర్చి ఉన్న పల్లెటూరు. 9వ తరగతి చదువుతుండగా ఇంటి నుంచి వచ్చేశా. హిజ్రాగా మారి 13 ఏళ్లయ్యింది. అమ్మ, నాన్నలు చనిపోయారు. అవిటి అక్క, అమ్మమ్మ, తాతయ్య ఉన్నారు. వారి పోషణ నాపై ఉంది. అద్దె ఇల్లు. కరెంట్‌ లేదు. చాలాహీనంగా బతుకుతున్నా. భిక్షాటన చేసిన సొమ్ములో సగంపైగా శరీర అలంకరణకు సరిపోతుంది. రోజంతా భిక్షాటన చేసినా రూ.200 నుంచి రూ.300కు మించి రాదు.

– పూజిత, భీమవరంఅమ్మాయిగానే ఊహించుకున్నా..

చిన్నప్పట్నుంచి అమ్మాయిగానే పెరిగా. అబ్బాయిని అని ఏనాడూ అనుకోలేదు. పూజిత అమ్మ నన్ను చేరదీసింది. తను నాకు స్కూల్‌లో పరిచయం. తను, నేను ఒకే పాఠశాలలో చదివాం. ఇప్పటికి హిజ్రాగా మారి ఆరేళ్లయ్యింది. స్లిమ్‌గా ఉండడానికి సంపాదించిన సొమ్ములో కొంత పోతుంది. అమ్మ (పూజిత) నన్ను సాకుతోంది. ఏ అవసరం ఉన్నా అమ్మే చూసుకుంటుంది.

– సురేఖ, భీమవరండిమాండ్స్‌

హిజ్రాలకు ఓటరు జాబితాలో చోటిచ్చారు. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించలేదు♦  డ్వాక్రా మహిళలకు ఇస్తున్న మాదిరిగానే బ్యాంకులు రుణాలివ్వాలి♦  ఇళ్లస్థలాలు కేటాయించి ప్రభుత్వమే పక్కా గృహాలు నిర్మించాలి♦  విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులు మాదిరిగా ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలి♦  భిక్షాటన చేసుకునే సమయంలో వారికి పోలీసులు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదు

నృత్య ప్రదర్శనలు ఇచ్చే♦  సమయంలోనూ పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించకూడదు అని హిజ్రాలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top