తాగి నడుపుతుంటే ఏం చేస్తున్నారు?
విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు నలుగురు మృతి చెందిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
- వైద్య విద్యార్థుల మృతి ఘటనపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు
- ఆ ట్రావెల్స్ మూసివేతకు తక్షణమే చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు నలుగురు మృతి చెందిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతుంటే మీరేం చేస్తున్నారంటూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. ప్రమాదానికికారణమైన బస్సు ఏ ట్రావెల్స్ అధీనంలో ఉందో గుర్తించి దానిని మూసివేయించేందుకు చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. సదరు ట్రావెల్స్‌పై కేవలం మోటారు వాహన చట్ట నిబంధనల కింద కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవద్దని, క్రిమినల్ కేసులు నమోదు చేసి తీరాల్సిందేనని పేర్కొంది.
మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు అన్ని రహదారుల ప్రవేశ మార్గాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. సంబంధిత ట్రావెల్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14నరాత్రి 11 గంటలకు విజయవాడ సమీపంలోని గొల్లపూడి నల్లకుంట సెంటర్ వద్ద ప్రమాదం జరిగిందని పలు పత్రికల్లో కథనాలు రావడంతో వాటిని సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించిన హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
విద్యార్థులు అభ్యంతరం చెబుతున్నా మద్యం తాగిన వ్యక్తితో బస్సు నడిపించిన ధనుంజయ ట్రావెల్స్ మూసివేతకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి రామచంద్రరావు స్పందిస్తూ.. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఏర్పడిన కమిటీ రోడ్డు, రహదారుల భద్రతపై కొన్ని సూచనలు చేసిందని చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను గుర్తించి, తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే అన్ని టోల్ గేట్ల వద్ద పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని పోలీసుశాఖను ప్రభుత్వం ఆదేశించినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.


