అడవి..అలజడి | hi tention in badrachalam area's for maoists revange | Sakshi
Sakshi News home page

అడవి..అలజడి

Mar 12 2016 2:53 AM | Updated on Oct 9 2018 2:51 PM

అడవి..అలజడి - Sakshi

అడవి..అలజడి

మూడు రాష్ట్రాల సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

పేలిన మందు పాతర...
అటు మావోలు.. ఇటు ఖాకీలు..
ప్రతీకారేచ్ఛతో ఇరువర్గాలు
భయాందోళనలో ఆదివాసీలు

 భద్రాచలం: మూడు రాష్ట్రాల సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పోలీసులు, మావోలు వరుస దాడులకు సై అంటున్నారు. ఇరువర్గాలు వ్యూహాత్మక దాడులకు పాల్పడుతుండటంతో అటవీ ప్రాంతాలు నెత్తురోడుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంటకు కూతవేటు దూరంలో మొర్లగూడ అటవీ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న రహదారులను తనిఖీ చేసేందుకు సీఆర్‌పీఎఫ్ 217 బెటాలియన్ జవాన్లు క్యాంపు నుంచి వెళ్లారు. ఆ జవాన్లను లక్ష్యంగా చేసుకొని మావోలు మందుపాతర అమర్చారు. రహదారులను తనిఖీ చేస్తూ అటుగా వెళ్లిన జవాన్లు మందుపాతరపై కాలు వేయడంతో ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో డిప్యూటీ కమాండెంట్లు ప్రభాత్ త్రిపాఠి, శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ రంగరాఘవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే వీరిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం సీఐ సారంగపాణి, ఎస్సై కరుణాకర్, సీఆర్‌పీఎఫ్ అధికారులు వారికి ఆస్పత్రిలో తక్షణమే వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో వారికి చికిత్స చేశారు. త్రిపాఠికి ఆక్సిజన్‌తో పాటు వెంటిలేటర్ సౌకర్యం కల్పించాల్సి ఉండటంతో ఏరియా ఆస్పత్రి నుంచి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మిగతా ఇద్దరికి ఏరియా ఆస్పత్రిలోనే చికిత్స చేశారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రంగ రాఘవన్(42) మృతిచెందాడు.

 మారణకాండ తప్పదా..!
మావోలు ప్రతీకారేచ్ఛకు దిగుతున్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినప్పుడల్లా మావోయిస్టులు హతమవుతున్నారు. తమదైన శైలిలో మావోలు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన వారిని గుర్తించి.. ప్రజా కోర్టులు నిర్వహించి.. అక్కడి ప్రజల తీర్పు మేరకు వారిని హతమార్చుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించే ఛత్తీస్‌గఢ్ పోలీస్ బలగాలపై విరుచుకుపడుతున్నారు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోలు మృతిచెందగా.. అందుకు రెట్టింపు సంఖ్యలో అనుమానితులు, చత్తీస్‌గఢ్ పోలీసులను మావోలు హతమార్చారు. జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని కంచాలలో 2008లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోలు మృతిచెందారు. అది జరిగిన మూడు నెలల వ్యవధిలోనే ఘటనకు బాధ్యులను చేస్తూ చర్ల మండలంతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలకు చెందిన సుమారు 30 మందిని మావోలు హతమార్చారు.

2014లో పువ్వర్తిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోలు మృతిచెందారు. అదేరోజు పువ్వర్తి కాల్పుల్లో పాల్గొన్న గ్రేహౌండ్స్ ఆర్‌ఐని వెంటాడి కౌరగట్ట వద్ద దారుణంగా నరికి చంపి.. పోలీసులకు సవాల్ విసిరారు. ఆర్‌ఐ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు వెనుకంజ వేసే రీతిన నాడు మావోలు ప్రతిదాడులకు పాల్పడ్డారు. ఈనెల 1న బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో బొట్టెంతోగు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోలు మృతిచెందారు. ఇది జరిగిన రెండో రోజే మావోలు ఛత్తీస్‌గఢ్ పోలీసులపై పంజా విసిరారు. బీజాపూర్ జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో దబ్బమడక అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న ఛత్తీస్‌గఢ్ బలగాలపై విరుచుకుపడ్డారు. భీకర పోరులో ప్రత్యేక కోబ్రా బలగాలకు చెందిన ముగ్గురు అధికారులు మృతిచెందగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిణామాలను చూస్తే.. మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ మారణకాండ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.

 సరిహద్దుల్లో హై అలర్ట్
బొట్టెంతోగు ఎన్‌కౌంటర్‌లో 9 మంది సహచరులను కోల్పోయిన మావోలు ప్రతీకారేచ్ఛతో దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌కౌంటర్ తరువాత ప్రత్యేక పోలీసు బలగాలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఇటు పోలీసులు, అటు మావోల వ్యూహాత్మక దాడులతో సరిహద్దు అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగుతోంది. శుక్రవారం మావోయిస్టులు మందుపాతర అమర్చిన ప్రదేశం భద్రాచలానికి 70 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో హై అలర్ట్ ప్రకటించారు.

 అడవి అంతా మందుపాతరలేనా..!
పోలీసులను దెబ్బతీసేందుకు సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున మందుపాతరలు అమర్చినట్లు శుక్రవారం జరిగిన ఘటనతో తేటతెల్లమవుతోంది. సీఆర్‌పీఎఫ్ జవాన్లనే టార్గెట్‌గా చేసుకొని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఇదే రీతిన అడవుల్లో మరెక్కడైనా అమర్చారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా కూంబింగ్ సమయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement