హామీల అమలులో ప్రభుత్వం విఫలం
హుజూర్‌నగర్ : ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, కోడి మల్లయ్యయాదవ్‌లు అన్నారు.
హుజూర్‌నగర్ : ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, కోడి మల్లయ్యయాదవ్‌లు అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ అనేక రకాల హామీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కేజీ టు పీజీ విద్య, లక్ష ఉద్యోగాల వంటి పనులు కనీసం అమలుకు నోచుకోవడం లేదన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండక, రుణమాఫీ పథకం అమలు కాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. కరువు మండలాలను ప్రకటించి నిధులు విడుదల చేయకుండా ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఉపాధి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నా ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంలో, డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్రయూత్ విభాగం కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, హుజూర్‌నగర్, మఠంపల్లి మండల అధ్యక్షులు జడ రామకృష్ణయాదవ్, జాలకిరణ్‌యాదవ్, పట్టణ, మండల మహిళా అధ్యక్షురాళ్లు కారింగుల మంగమ్మ, పశ్య మల్లేశ్వరి, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు కుంభం శివ, నాయకులు వేముల శ్రీను, దాసరి రాములు, పిల్లి మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు.