కొత్త రాజధానికి ‘ద్వీప’కాంతులు | Golf courts and resorts | Sakshi
Sakshi News home page

కొత్త రాజధానికి ‘ద్వీప’కాంతులు

Published Wed, Oct 7 2015 4:27 AM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

కొత్త రాజధానికి ‘ద్వీప’కాంతులు

♦ గోల్ఫ్ కోర్టు, రిసార్టులు..
♦ ద్వీపానికి వెళ్లేందుకు మూడు బ్రిడ్జిలు.. రోడ్డుకు ఇరువైపులా ఐకానిక్ టవర్లు
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన భవానీ ద్వీపం సమీపంలో ఉన్న మరో ద్వీపాన్ని అభివృద్ధి చేసి దాన్ని రాజధాని నగరానికి అనుసంధానం చేయనున్నారు. సింగపూర్ ప్రభుత్వ కంపెనీలిచ్చిన మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే ఈ ద్వీపం ఆధారంగా కొత్తగా రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించేందుకు సీఆర్‌డీఏ వ్యూహరచన చేసింది. ఈ నెల 22న రాజధానికి శంకుస్థాపన చేసే ప్రాంగణం కూడా ఈ ద్వీపానికి అనుసంధానమైన రోడ్డుకు పక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు. శంకుస్థాపన చేసే ఉద్ధండ్రాయునిపాలెం గ్రామానికి ఎదురుగా కృష్ణానదిలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక చిన్న ద్వీపం ఉంది. భవానీ ద్వీపానికి ఇది రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

నదిలో పలుచోట్ల ఉన్న చిన్న, చిన్న ద్వీపాల్లోని మట్టిని తెచ్చి దీన్ని ఇంకా పటిష్టం చేసి దీర్ఘచతురస్రాకారంలోకి మార్చుతారు. అలా ఈ ద్వీపాన్ని తయారు చేసి అందులోని 10-12 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ కోర్టు, ఫుడ్‌కోర్టులు, రిసార్టులు, హోటళ్లు నెలకొల్పాలని సంకల్పించారు. విజయవాడ వైపు నుంచి ఈ ద్వీపంలోకి వెళ్లేందుకు బోటు మార్గం, రాజధాని నుంచి  బ్రిడ్జిల మీదుగా రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ద్వీపం చుట్టూ ఆకర్షణీయమైన రిటెయినింగ్ వాల్‌ను నిర్మిస్తారు.

 ద్వీపం నుంచి బ్రిడ్జ్ కమ్ రోడ్డు
 ఈ ద్వీపం నుంచి రాజధాని వైపు కరకట్ట వరకూ మూడు బ్రిడ్జిలు నిర్మించేందుకు రూపకల్పన చేశారు. ద్వీపం మధ్య భాగం నుంచి ఉద్ధండ్రాయునిపాలెం వరకూ బ్రిడ్జి, అక్కడి నుంచి రాజధాని డౌన్‌టౌన్ వరకూ రహదారిని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ బ్రిడ్జి కమ్ రోడ్డు నాలుగు వరుసలుగా ఉంటుంది. ఈ బ్రిడ్జి రాజధానిలో ప్రవేశించే చోటే ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో శంకుస్థాపన ప్రాంతాన్ని ఈ రోడ్డుకు జంక్షన్‌గా మార్చి దాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.

ఈ జంక్షన్‌కు కొంచెం అవతల రోడ్డుకిరువైపులా 25 నుంచి 40 అంతస్తుల ఐకానిక్ టవర్లు నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. ద్వీపం మధ్యభాగం నుంచి నిర్మించే బ్రిడ్జితోపాటు దానికి రెండువైపులా మరో రెండు బ్రిడ్జిలను కరకట్ట వరకూ నిర్మిస్తారు. అంటే ద్వీపం నుంచి రాజధాని ప్రాంతానికి మూడు బ్రిడ్జిలుంటాయి. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిలను నిర్మించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement