ఈ రాజకీయాలతో చదవలేం | Sakshi
Sakshi News home page

ఈ రాజకీయాలతో చదవలేం

Published Wed, Sep 21 2016 8:27 AM

ghantasala venkateswara rao government music college students write letter to governor narasimhan

గవర్నర్‌కు ఘంటసాల సంగీత, నృత్య కళాశాల  విద్యార్థుల లేఖ
రాజకీయాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ఏకరువు
‘సాక్షి’ చేతికి చిక్కిన లేఖ

 
విజయవాడ కల్చరల్ : నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో జరుగుతున్న రాజకీయాలతో తాము చదువుకోలేని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఇ.సి.ఎల్.నరసింహన్‌కు లేఖ రాశారు. కళాశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తమకు విద్యాభిక్ష పెట్టాలని ఆ లేఖలో వేడుకున్నారు. ఆ లేఖ ‘సాక్షి’ చేతికి చిక్కింది.
 
 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు మంచి పేరు ఉంది. వేలాది మంది నృత్య కళాకారులు, సంగీత కోవిదులను ప్రపంచానికి అందించిన ఘనత ఈ కళాశాల సొంతం. సంగీత ప్రపంచ రారాజు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వంటి ప్రముఖులు కళాశాల ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పారు.
 
 దురదృష్టవశాత్తూ రెండేళ్లుగా సంగీత కళశాలలో అధికార పార్టీ నాయకులు తిష్టవేసి సాంస్కృతిక, భక్తి కార్యక్రమాల పేరుతో కళాశాల ప్రతిష్టను దిగజార్చారు. చివరకు అధిపత్య పోరులో దాడులు, హత్యాయత్నం కేసుల వరకూ తీసుకెళ్లారు. రెండేళ్లు ఓపికపట్టిన విద్యార్థులు తాజాగా తమ కళాశాలలో మరో కార్యక్రమం నిర్వహించేందుకు అధికార పార్టీ నాయకులు చర్యలు చేపట్టిన నేపథ్యంలో సంగీత కళాశాల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు.
 
 లేఖలోని ముఖ్యాంశాలు
 సంగీత కళాశాలలో నెలల తరబడి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఏకాగ్రత కుదరడంలేదు. కళాశాల పని దినాల్లో కారిడార్‌లో అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నారు. ముఖ్యంగా బాలికలమైన మేం భయంతో వణికిపోతున్నాం.
 
 గతంలో కళాశాలలో ప్రయివేటు కార్యక్రమాలు జరిగినప్పుడు పేరెంట్స్ కమిటీ ద్వారా కళాశాల ప్రిన్సిపాల్‌కు, సంబంధిత అధికారులకు విన్నవించుకున్నాం. భవిష్యత్‌లో జరుగకుండా చేస్తామని వారు హామీ ఇచ్చారు. కానీ పరిస్థితిలో మార్పులేదు సరికదా ఇంకా దారుణంగా తయారైంది.
 
 ప్రభుత్వ కార్యాలయాల్లో మతపరమైన కార్యక్రమాలు జరుగకూడదని నింధనలు చెపుతున్నా రాజకీయ నాయకులు పూజల పేరుతో కళాశాలలో ప్రవేశిస్తున్నారు.
 
 రాజకీయ నాయకులు విలేకరుల సమావేశాలు పెట్టడం, బహిరంగంగా తిట్టుకోవటం వల్ల సంగీత కళాశాల ప్రతిష్ట దిగజారుతోంది.
 
 భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల కార్యాలయం సంగీత కళాశాలలోనే పనిచేస్తోంది. అయితే సంచాలకుడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు.
 
 గతంలో కళాశాలలో జరుగుతున్న కార్యక్రమంలో కళాకారుల ప్రవేశం ఉండేది. కొద్దికాలంగా రాజకీయ నాయకులు మతపరమైన కార్యక్రమాలు చేస్తూ కళాశాల ప్రతిష్టను దిగజారుస్తున్నారు.
 
 సంగీత కళాశాలలో జరుగుతున్న కార్యక్రమాల వల్ల సంగీతం, నృత్యం అభిరుచి ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలకు పంపడానికి భయపడుతున్నారు. సంగీత కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది.
 
 సంగీత కళాశాల రక్షణగా ఉన్న గోడను కూల్చివేశారు.
 
 గతంలో సంగీత కళాశాలకు రాజకీయ నాయకులు లేని కమిటీ ఉండేది. కళాశాలోని కార్యక్రమాలను పర్యవేక్షించేది. ఇప్పుడు ఆ కమిటీ లేకపోవడం వల్ల సంస్కృతి, సంప్రదాయాలు లేని కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
 
 దయజేసి రాజకీయ నాయకుల ప్రవేశం నుంచి కళాశాలను కాపాడాలి.

Advertisement
Advertisement