breaking news
Government Music College
-
ఈ రాజకీయాలతో చదవలేం
గవర్నర్‌కు ఘంటసాల సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల లేఖ రాజకీయాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ఏకరువు ‘సాక్షి’ చేతికి చిక్కిన లేఖ విజయవాడ కల్చరల్ : నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో జరుగుతున్న రాజకీయాలతో తాము చదువుకోలేని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఇ.సి.ఎల్.నరసింహన్‌కు లేఖ రాశారు. కళాశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తమకు విద్యాభిక్ష పెట్టాలని ఆ లేఖలో వేడుకున్నారు. ఆ లేఖ ‘సాక్షి’ చేతికి చిక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు మంచి పేరు ఉంది. వేలాది మంది నృత్య కళాకారులు, సంగీత కోవిదులను ప్రపంచానికి అందించిన ఘనత ఈ కళాశాల సొంతం. సంగీత ప్రపంచ రారాజు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వంటి ప్రముఖులు కళాశాల ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పారు. దురదృష్టవశాత్తూ రెండేళ్లుగా సంగీత కళశాలలో అధికార పార్టీ నాయకులు తిష్టవేసి సాంస్కృతిక, భక్తి కార్యక్రమాల పేరుతో కళాశాల ప్రతిష్టను దిగజార్చారు. చివరకు అధిపత్య పోరులో దాడులు, హత్యాయత్నం కేసుల వరకూ తీసుకెళ్లారు. రెండేళ్లు ఓపికపట్టిన విద్యార్థులు తాజాగా తమ కళాశాలలో మరో కార్యక్రమం నిర్వహించేందుకు అధికార పార్టీ నాయకులు చర్యలు చేపట్టిన నేపథ్యంలో సంగీత కళాశాల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు సంగీత కళాశాలలో నెలల తరబడి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఏకాగ్రత కుదరడంలేదు. కళాశాల పని దినాల్లో కారిడార్‌లో అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నారు. ముఖ్యంగా బాలికలమైన మేం భయంతో వణికిపోతున్నాం. గతంలో కళాశాలలో ప్రయివేటు కార్యక్రమాలు జరిగినప్పుడు పేరెంట్స్ కమిటీ ద్వారా కళాశాల ప్రిన్సిపాల్‌కు, సంబంధిత అధికారులకు విన్నవించుకున్నాం. భవిష్యత్‌లో జరుగకుండా చేస్తామని వారు హామీ ఇచ్చారు. కానీ పరిస్థితిలో మార్పులేదు సరికదా ఇంకా దారుణంగా తయారైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మతపరమైన కార్యక్రమాలు జరుగకూడదని నింధనలు చెపుతున్నా రాజకీయ నాయకులు పూజల పేరుతో కళాశాలలో ప్రవేశిస్తున్నారు. రాజకీయ నాయకులు విలేకరుల సమావేశాలు పెట్టడం, బహిరంగంగా తిట్టుకోవటం వల్ల సంగీత కళాశాల ప్రతిష్ట దిగజారుతోంది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల కార్యాలయం సంగీత కళాశాలలోనే పనిచేస్తోంది. అయితే సంచాలకుడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. గతంలో కళాశాలలో జరుగుతున్న కార్యక్రమంలో కళాకారుల ప్రవేశం ఉండేది. కొద్దికాలంగా రాజకీయ నాయకులు మతపరమైన కార్యక్రమాలు చేస్తూ కళాశాల ప్రతిష్టను దిగజారుస్తున్నారు. సంగీత కళాశాలలో జరుగుతున్న కార్యక్రమాల వల్ల సంగీతం, నృత్యం అభిరుచి ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలకు పంపడానికి భయపడుతున్నారు. సంగీత కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. సంగీత కళాశాల రక్షణగా ఉన్న గోడను కూల్చివేశారు. గతంలో సంగీత కళాశాలకు రాజకీయ నాయకులు లేని కమిటీ ఉండేది. కళాశాలోని కార్యక్రమాలను పర్యవేక్షించేది. ఇప్పుడు ఆ కమిటీ లేకపోవడం వల్ల సంస్కృతి, సంప్రదాయాలు లేని కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దయజేసి రాజకీయ నాయకుల ప్రవేశం నుంచి కళాశాలను కాపాడాలి. -
కళావేదికపై వెస్ట్రన్ డ్యాన్సులా?
- సంగీత సరస్వతికి అవమానమంటూ కళాకారుల ఆవేదన భవానీపురం : సంగీత సరస్వతికి అవమానం జరుగుతుందంటూ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రదర్శన ఇచ్చేముందు నమస్కరించి ఎక్కే కళావేదికపై పాశ్చాత్య నృత్యాలు ప్రదర్శించనున్నారని తెలిసి కళాకారులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కళావేదికపై వెస్ట్రన్ డ్యాన్సులకు అనుమతి ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయసారథి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదివారం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలోని కళావేదికపై కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో టీవీ ఛానల్స్‌లో ప్రదర్శనలిచ్చే కళాకారులతో, హీరోయిన్లతో వెస్ట్రన్ డ్యాన్సు ఏర్పాటు చేసినట్లు ఫ్లెక్సీలు కళాశాల గేటు ఎదుట ప్రదర్శించారు. వాటిని చూసి కళాభిమానులు, కళాకారులు ఆందోళన చెందుతున్నాన్నారు. వాస్తవానికి సంగీత కళాశాల ప్రాంగణంలోని కళా వేదికపై సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే అనుమతినివ్వాల్సి ఉంది. రాజకీయ పార్టీల సమావేశాలకు, మాంసాహారంతో కూడిన భోజనాలకు, అశ్లీల నృత్యాలు-సంగీత విభావరులకు అనుమతులు లేవు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రాజకీయ నాయకుల ఒత్తిడిలకు తలొగ్గి అన్ని కార్యక్రమాలకు ఇవ్వడం ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఆదివారం జరుగనున్న పాశ్చాత్య నృత్య కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై కళాశాల అధ్యాపకుల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమాలు సంగీత కళాశాలలో జరగలేదని, ఇదే తొలిసారని కళాకారులు చెబుతున్నారు. ఇక్కడ సాధ్యం కాకే డాన్స్ ఇనిస్టిట్యూట్లు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాలు పెట్టకుంటున్నాయని తెలిపారు. కాగా సినీ, టీవీ కళాకారులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున వచ్చే ప్రజలను అదుపుచేయడం కూడా ఒక సమస్య అవుతుందని కళాకారులు అంటున్నారు. ఇప్పటికే సంగీత కళాశాలలో సంగీత విభావరులపై చుట్టుపక్కల నివాసితులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా వెస్ట్రన్ డాన్స్‌లు ఏర్పాటు చేయడం గమనార్హం.