మాగంటి వర్సెస్ మొడియం | Fighting dominant between tdp ledaers | Sakshi
Sakshi News home page

మాగంటి వర్సెస్ మొడియం

Feb 10 2016 4:20 AM | Updated on Aug 10 2018 9:42 PM

మాగంటి వర్సెస్ మొడియం - Sakshi

మాగంటి వర్సెస్ మొడియం

జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య వర్గ విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

 పోలవరం టీడీపీలో వర్గపోరు
  ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు బాబు వ్యూహం
 మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి తెచ్చేందుకు కసరత్తు
 నియోజకవర్గంలో మారనున్న సమీకరణాలు

 
 పోలవరం : జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య వర్గ విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం వరకు ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య కుమ్ములాటలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఎమ్మెల్యేలు, పార్టీలోని ప్రధాన నాయకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఇందుకు ప్రధాన కారణంగా ఇసుక తవ్వకాలు, సెటిల్‌మెంట్లు కావడం గమనార్హం. కొవ్వూరు నియోజకవర్గంలో నాయకులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రచ్చకెక్కగా తాజాగా పోలవరంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది.
 
 ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు ఎంపీ వ్యూహం
 పోలవరం నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గతేడాది ఇసుక ర్యాంపుల అజమాయిషీ విషయంలో ఏర్పడిన విభేదాలు క్రమేణా తీవ్రస్థాయికి చేరాయి. ఇటీవల కొయ్యలగుడెం మండలంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మొడియంను ఉద్దేశించి ఎంపీ మాగంటి బాబు తీవ్రవ్యాఖ్యలు చేయటంతో అవి రచ్చకెక్కాయి. ఒక దశలో వీరి పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో మొడియంకు చెక్ పట్టేందుకు ఎంపీ బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన పూనెం సింగన్నదొరను టీడీపీలో చేర్పించేందుకు రంగం సిద్ధం చేశారు. అధిష్టానం వద్ద పలుకుబడి కలిగిన కొయ్యలగూడెంకు చెందిన ఒక నాయకుడి ద్వారా సింగన్నదొరను పార్టీలో చేర్పించేందుకు సిద్ధం చేసినట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో సింగన్నదొరకు లేదా ఆయన కుమారుడికి సీటు ఇస్తామని ఆశ చూపించి పార్టీలోకి రప్పిస్తున్నట్టు సమాచారం.  
 
 గ్రామాల్లో పర్యటిస్తున్న సింగన్నదొర
 ఈ నేపథ్యంలో సింగన్నదొర తన కుమారుడితో కలిసి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో టీడీపీ నాయకులను కలిసి మద్దతు కోరినట్టు సమాచారం. అయితే నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మొడియం ఆధిపత్యానికి గండికొట్టాలనే లక్ష్యంతో ఎంపీ మాగంటి బాబు ఆయనను రంగంలోకి తెస్తున్నారు. మొదటి నుంచి టీడీపీలోనే ఉన్న సింగన్నదొర పదేళ్ల కిందట చంద్రబాబు వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ అభ్యర్థి బాలరాజుకు మద్దతు పలికారు.ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో సింగన్నదొర మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్ధపడడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు వైఖరి నచ్చకే పార్టీని వీడిన ఆయన ఎంపీ బాబు కోసం టీడీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ధపడడం ఆ పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. ఆయన వచ్చిన అనంతరం నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement