ఏసీటీవో లంచాలను బయటపెట్టిన ఫేస్బుక్ | facebook post reveals corruption in commercial tax office | Sakshi
Sakshi News home page

ఏసీటీవో లంచాలను బయటపెట్టిన ఫేస్బుక్

Oct 2 2015 10:07 AM | Updated on Sep 22 2018 8:31 PM

ఫేస్‌బుక్‌లో పెట్టిన లంచాల జాబితా ఇదే.. - Sakshi

ఫేస్‌బుక్‌లో పెట్టిన లంచాల జాబితా ఇదే..

అనంతపురం జిల్లా హిందూపురంలోని వాణిజ్య శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంటున్న అవినీతి బాగోతాన్ని ఓ ఫేస్బుక్ పోస్టింగ్ బయటపెట్టింది.

అనంతపురం జిల్లా హిందూపురంలోని వాణిజ్య శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంటున్న అవినీతి బాగోతాన్ని ఓ ఫేస్బుక్ పోస్టింగ్ బయటపెట్టింది. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ) హబీబ్ లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నారంటూ వాణిజ్య శాఖకు చెందిన నాగరాజు అనే ఓ ప్రైవేటు ఉద్యోగి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో అలజడి చెలరేగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఏసీటీవో, జూనియర్ అసిస్టెంట్, స్పెషల్ వింగ్ స్టాఫ్, ప్రైవేటు బాయ్స్‌తో  ప్రతి నెలా ఒక్కొక్క షాపు నుంచి రూ.3 వేలు మొదలుకుని రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వసూళ్ల చిట్టాను ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఏసీటీవో రూ.70 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఐరన్, సిమెంట్ షాపుల నుంచి రూ.20 వేలు, ఫైర్ వర్క్ డీలర్స్ నుంచి రూ.30వేలు, హోల్‌సేల్ కిరాణా మర్చంట్స్ నుంచి రూ.50 వేలు, తూమకుంట, గోళాపురం ఐరన్ ఫ్యాక్టరీల నుంచి రూ.లక్ష, సోప్స్ వ్యాపారుల నుంచి రూ.25 వేలు, ముద్దిరెడ్డిపల్లి పట్టుచీరల వ్యాపారుల నుంచి రూ.లక్ష, బెంగళూరు పార్సిల్ సర్వీసు నుంచి రూ.50 వేల చొప్పున.. ఇలా ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ చిట్టా ఉంచారు.

కాగా.. తూమకుంట చెక్‌పోస్టులో జనరేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నాగరాజు ఈ వివరాలు ఫేస్‌బుక్‌లో ఉంచి తన ప్రతిష్ఠకు భంగం కల్గించారని ఏసీటీవో హబీబ్ హిందూపురం రూరల్ ఎస్సై ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై నాగరాజును స్టేషన్‌కు పిలిపించి విచారించారు.  కేసు నమోదు చేస్తున్నామని, పూర్తిస్థాయి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. ఫేస్‌బుక్‌లో ఉంచిన అక్రమ వసూళ్ల వివరాలపైనా ఆరా తీస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement